INDW vs SLW: టీ20ల్లో భారత్ ప్రభంజనం.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో మహిళల జట్టు విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచిన టీమిండియా... అదే ఆత్మవిశ్వాసాన్ని టీ20ల్లోనూ కొనసాగిస్తోంది. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఆధిపత్యాన్ని చాటింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన నాలుగో మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో అజేయ ఆధిక్యాన్ని సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలి వర్మ శుభారంభం అందించారు.
Details
అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్డు
ఇద్దరూ కలిసి కేవలం 15.2 ఓవర్లలోనే 162పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహిళల టీ20ల్లో భారత్ తరఫున ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. వీరి ధాటికి శ్రీలంక బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. మంధాన-షఫాలి అద్భుత భాగస్వామ్యంతో భారత్ 2 వికెట్లకు 221పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది భారత మహిళల టీ20 చరిత్రలోనే అత్యధిక జట్టు స్కోరుగా నిలవడం విశేషం. మంధాన తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లతో 80 పరుగులు చేసి ఆకట్టుకోగా... షఫాలి వర్మ వరుసగా మూడో అర్ధసెంచరీ సాధిస్తూ 79పరుగులు చేసింది. తొలి టీ20 సెంచరీ సాధించే అవకాశాన్ని షఫాలి కేవలం స్వల్ప తేడాతో చేజార్చుకుంది. ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత కూడా భారత్ స్కోరు వేగం తగ్గలేదు.
Details
విజృంభించిన రిచా
రిచా ఘోష్ 16 బంతుల్లోనే 40 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్‌పై విరుచుకుపడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 9 బంతుల్లో 16 పరుగులు చేస్తూ మూడో వికెట్‌కు రిచాతో కలిసి 53 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు హసిని పెరెరా (33), కెప్టెన్ చమరి ఆటపట్టు (52) కలిసి మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే భారీ లక్ష్యం కారణంగా అవసరమైన రన్‌రేట్ క్రమంగా పెరిగిపోవడంతో చివరి ఓవర్లలో లంక బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు.
Details
డిసెంబర్ 30న నాలుగో టీ20
ఈ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ ప్రత్యేకంగా నిలిచింది. తొమ్మిది డాట్ బంతులు వేసి బ్యాటర్లపై ఒత్తిడి పెంచడమే కాకుండా... కీలక సమయంలో చమరి ఆటపట్టు, హర్షిత సమరవిక్రమలను అవుట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు మలిచింది. అరుంధతి రెడ్డి కూడా రెండు కీలక వికెట్లు తీసి లంక ఆశలను దెబ్బతీసింది. చివరి వరకు పోరాడిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ డిసెంబర్ 30న ఇదే వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టు... క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.