
India vs West Indies Test:నేటి నుండి వెస్టిండీస్ తో భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలిహోమ్ టెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి నుంచి (గురువారం) భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సాధారణంగా భారత గడ్డపై కనిపించే పరిస్థితులకు భిన్నంగా, ఈ సారి జరుగనున్న తొలి టెస్టులో పిచ్ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండనున్నాయి. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చక్రంలో భారత్‌కు ఇది తొలి హోమ్ సిరీస్ కావడం విశేషం. గత ఏడాది ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన భారత్, ఈ సారి మాత్రం ఎలాగైనా ఫైనల్ వరకు చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌తో శుభమన్ గిల్ తొలిసారి భారత గడ్డపై టెస్టు జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు.
వివరాలు
ఈ టెస్టుకు రెడ్ సాయిల్ పిచ్
ఈ టెస్టుకు నరేంద్ర మోదీ స్టేడియంలో రెడ్ సాయిల్ పిచ్ ఎంచుకున్నారు. ఈ రకమైన పిచ్ పేస్ బౌలర్లకు మరింత అనుకూలమయ్యే అవకాశం ఉంది. అందువల్ల భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముగ్గురు పేసర్లను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే వాతావరణం మాత్రం మ్యాచ్‌కు అడ్డంకిగా మారే అవకాశముంది. గత కొద్ది రోజులుగా అహ్మదాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వర్షం ముప్పు ఈ టెస్టుపై పొంచి ఉంది. అక్టోబర్ 2న జరిగే తొలి రోజు ఆటకు 84 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. రెండవ రోజు, మూడవ రోజు (శుక్రవారం, శనివారం) వర్షం కేవలం 25 శాతం మాత్రమే ఉండవచ్చని అంచనా.
వివరాలు
మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం తక్కువే
కానీ నాలుగో రోజు, ఐదో రోజు (ఆదివారం, సోమవారం) మళ్లీ వర్షం కురిసే అవకాశం 71 నుండి 90 శాతం వరకు పెరుగుతుందని చెబుతున్నారు. అయినప్పటికీ ఈ వర్షం రోజు మొత్తం కాకుండా మధ్య మధ్యలో మాత్రమే పడే అవకాశం ఉండటంతో, మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం తక్కువగానే ఉందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి భారత్-వెస్టిండీస్ తొలి టెస్టులో ఇరుజట్లు బరిలోకి దిగే అంచనా ప్లేయింగ్ ఎలెవన్ జట్లు ఇలా ఉండవచ్చని సమాచారం.
వివరాలు
ప్లేయింగ్ ఎలెవన్ జట్లు
భారత్ (Probable XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వెస్టిండీస్ (Probable XI): తేజనరైన్ చందర్‌పాల్, కెవ్లోన్ అండర్సన్, అలిక్ అతానాజ్, బ్రాండన్ కింగ్, షై హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్, జోమెల్ వార్రికన్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్