IND w Vs SL w: సిరీస్ ఆధిక్యంతో భారత్.. హుషారుగా మరో పోరుకు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
జోరుమీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగే రెండో టీ20లో శ్రీలంకను ఢీకొననుంది. విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0ఆధిక్యం పొందిన సంగతి తెలిసిందే. అయితే తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 121/6కు కట్టడి చేసినప్పటికీ భారత జట్టు ఫీల్డింగ్, ముఖ్యంగా క్యాచింగ్‌లో ఇంకా మెరుగుదల అవసరం కనిపిస్తోంది. ఆ మ్యాచ్‌లో భారత్ ఏకంగా అయిదు క్యాచ్‌లు చేజార్చింది. ఈ విషయంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ, "మేం మా ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఎందుకు వరుసగా క్యాచ్‌లు చేజారుతున్నాయో అర్థం కావడం లేదు.
Details
సుమారు ఆరు వారాల విరామం
వచ్చే మ్యాచ్‌లో మెరుగైన ఫీల్డింగ్ చేస్తాం" అని తొలి టీ20 అనంతరం వ్యాఖ్యానించింది. ప్రపంచకప్ అనంతరం భారత జట్టుకు సుమారు ఆరు వారాల విరామం లభించింది. ఆ విరామం కారణంగా ఫీల్డింగ్‌లో పూర్తి లయ అందుకోవడానికి కొంత సమయం పడే అవకాశముంది. అయినప్పటికీ, ఫీల్డింగ్‌లో చిన్నపాటి లోపాలు ఉన్నా రెండో టీ20లో కూడా భారత్ తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌లో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ తొలి టీ20లోనూ ఆకట్టుకుంది. ఆమె అదే జోరును కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ షెఫాలి వర్మకు ఈ సిరీస్ ఎంతో కీలకం. తన ఆటకు అనుకూలమైన ఈ ఫార్మాట్‌లో ఆమె నిలకడ సాధించాల్సిన అవసరం ఉంది.
Details
పటిష్టంగా భారత బ్యాటింగ్ లైనప్
స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మలతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ శ్రీలంకను మరోసారి దెబ్బతీయడానికి భారత్ సిద్ధమైంది. గత మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 20 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్టవి శర్మ మంచి ప్రభావం చూపింది. వికెట్లు పడగొట్టకపోయినా కేవలం 16 పరుగులే ఇచ్చి, ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా ఆకట్టుకుంది. దీప్తి శర్మ, శ్రీచరణితో కలిసి ఆమె స్పిన్ భారం మోయనుంది. పేస్ బాధ్యతలను అరుంధతి రెడ్డి, అమన్‌జ్యోత్ కౌర్ నిర్వర్తించనున్నారు. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
Details
10 టీ20ల్లో భారత్ 8 విజయాలు
రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టును అడ్డుకోవడం చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టుకు గట్టి సవాలే. గణాంకాలు కూడా భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి. శ్రీలంకతో ఆడిన గత 10 టీ20ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఈ మైదానంలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. అదే సమయంలో బ్యాటర్లకూ పరుగులు చేసే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌లో మంచు కీలక పాత్ర పోషించనుంది.
Details
పిచ్ - వాతావరణం
టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకునే అవకాశం ఎక్కువ. టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి దీప్తి శర్మకు ఇంకా 2 వికెట్లు అవసరం. శ్రీలంకతో ఇప్పటివరకు ఆడిన 27 టీ20 మ్యాచ్‌లలో భారత్ 21 విజయాలు సాధించగా, కేవలం 5 మ్యాచ్‌ల్లోనే ఓడింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.