Asian Games 2023: వెల్‌డన్.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత ఆర్చరీ జట్లు
చైనా వేదికగా హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాయి. ఓజాస్ డియోటాలే, అభిషేక్ వర్మ, ప్రథమేష్ జావ్కర్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ప్రీ-క్వార్టర్స్‌లో 235-219 తేడాతో సింగపూర్ జట్టును ఓడించారు. నాలుగు ఎండ్‌లలో 58, 59, 59, 59 స్కోర్ సత్తా చాటారు. దీంతో క్వార్టర్స్ ఫైనల్స్‌లో అక్టోబర్ 5న భారత పురుషుల ఆర్చరీ జట్టు భూటాన్‌తో తలపడనుంది. అటాను దాస్, ధీరజ్ బొమ్మదేవర, తుషార్ షెల్కేలతో కూడిన పురుషుల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్స్ దశలో 58-47, 57-49, 57-55 స్కోర్‌లతో హాంకాంగ్‌పై 6-0 తేడాతో విజయం సాధించింది.
అక్టోబర్ 6న రికర్వ్ జట్లకు క్వార్టర్ ఫైనల్స్
అంకిత భక్కత్, భజన్ కౌర్, సిమర్‌జీత్ కౌర్‌లతో కూడిన మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు ప్రీక్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌పై 5-1 తేడాతో గెలుపొందింది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో ఈ జట్టు హాంకాంగ్‌తో తలపడనుంది. అక్టోబర్ 6న రికర్వ్ జట్లకు క్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి. పురుషుల విభాగంలో మంగోలియాతో, మహిళల రికర్వ్ ఆర్చరీలో జపాన్‌తోనూ భారత్ తలపడనుంది.