LOADING...
Rohini Kalam: క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం .. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య 
జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య

Rohini Kalam: క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం .. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రీడా రంగాన్ని షాక్‌కు గురిచేసే సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ జియూ-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) ఆత్మహత్యకు పాల్పడింది. 2022 ఆసియా క్రీడల్లో భారత తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆమె, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ పట్టణంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నది. ఆమె గదిలో వేలాడుతూ కనిపించిన రోహిణిని చూసిన చెల్లెలు ఒక్కసారిగా కేకలు వేయడంతో, పొరుగువారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఒత్తిడి కారణంగా రోహిణి కలాం ఆత్మహత్య చేసుకున్నట్లుగా సోదరి ఆరోపించింది.

వివరాలు 

సంఘటన సమయంలో ఇంట్లో లేని రోహిణి తల్లిదండ్రులు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలను విచారిస్తున్నారు. రాధాగంజ్‌లోని అర్జున్‌నగర్‌లో నివసిస్తున్న రోహిణిని మొదటగా ఆమె చెల్లెలు రోష్ని కలాం గమనించి ఇతరులను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. రోహిణిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. సంఘటన సమయంలో రోహిణి తల్లిదండ్రులు ఇంట్లో లేరని సమాచారం.

వివరాలు 

కీలక విషయాలు వెల్లడించిన రోహిణి సోదరి 

పోలీసులకు రోహిణి సోదరి రోష్ని ఇచ్చిన వివరాల ప్రకారం.. రోహిణి అష్టాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నది. శనివారం ఆమె దేవాస్‌లోని ఇంటికి తిరిగి వచ్చిందని.. ఇటీవల ఉద్యోగ ఒత్తిడి కారణంగా ఆమె మనోవేదనకు గురైందని రోష్ని తెలిపింది. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత, ఫోన్‌లో మాట్లాడుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయిందని వివరించింది. రోష్ని ప్రకారం, రోహిణి ఫోన్‌లో మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు, అలాగే ప్రిన్సిపాల్ తనను ఇబ్బంది పెడుతున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు తాను విన్నానని తెలిపింది. అలాగే, తల్లిదండ్రులు ఆమె వివాహం జరిపించాలని ప్రయత్నించినా, రోహిణి నిరాకరించిందని ఆమె వెల్లడించింది.

వివరాలు 

అనారోగ్యం, ఒత్తిడి కారణమా? 

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, సుమారు ఐదు నెలల క్రితం రోహిణికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం బాగోలేకపోయిందని తెలిపారు. దానికి తోడు పాఠశాల పనిభారం పెరగడంతో మానసిక ఒత్తిడి పెరిగి, ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకున్నదని కుటుంబ సభ్యులు బాధతో చెప్పారు.

వివరాలు 

కెరీర్ ఇలా.. 

రోహిణి 2007లో క్రీడా రంగంలో అడుగుపెట్టింది. 2015లో ఆమె ప్రొఫెషనల్ జియు-జిట్సు కెరీర్‌ను ప్రారంభించింది. హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భారత తరఫున పోటీ పడింది. అలాగే, బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రపంచ క్రీడలకు ఎంపికైన ఏకైక భారతీయ అథ్లెట్‌గా అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఆమె థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో 48 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించింది. తదుపరి అబుదాబిలో జరిగిన 8వ ఆసియా జియు-జిట్సు ఛాంపియన్‌షిప్ 2024 డ్యూయో క్లాసిక్ ఈవెంట్‌లో మరో కాంస్యం సాధించి దేశానికి పేరు తెచ్చింది.

వివరాలు 

క్రీడా సమాజం సంతాపం 

రోహిణి కలాం మరణ వార్తతో భారతీయ క్రీడా సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రతిభావంతురాలైన అథ్లెట్‌ను కోల్పోవడం పెద్ద నష్టం అని క్రీడా వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.