Loading...
CWG 2026: కామన్వెల్త్‌లో భారత పారా అథ్లెట్ల హవా.. స్వర్ణం, రజతం రెండూ మనోళ్లకే!
కామన్వెల్త్‌లో భారత పారా అథ్లెట్ల హవా.. స్వర్ణం, రజతం రెండూ మనోళ్లకే!

CWG 2026: కామన్వెల్త్‌లో భారత పారా అథ్లెట్ల హవా.. స్వర్ణం, రజతం రెండూ మనోళ్లకే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

కామన్వెల్త్ గేమ్స్‌ (Common Wealth Games)లో భారత అథ్లెట్లు మరోసారి సత్తా చాటారు. గురువారం భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరగా, రెండు రజత పతకాలు కూడా వచ్చి చేరాయి. ఇందులో గోల్డ్‌తో పాటు ఒక సిల్వర్‌ను భారత పారా అథ్లెట్లు సాధించగా, మరో రజత పతకాన్ని స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ అందించాడు. మరోవైపు భారత బాక్సర్లు కూడా అద్భుత ప్రదర్శనతో మరో ఆరు పతకాలను ఖాయం చేసి దేశానికి శుభవార్త అందించారు.

వివరాలు

పారా అథ్లెట్ల డబుల్ ధమాకా

పురుషుల 100 మీటర్ల టీ47 విభాగంలో భారత పారా అథ్లెట్లు దిలీప్ మహాదు గవిత్, మహమ్మద్ బాసిల్ తొలి రెండు స్థానాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు.

దిలీప్ మహాదు గవిత్ కేవలం 10.71 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా, మహమ్మద్ బాసిల్ 10.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకున్నాడు.

ఒకే ఈవెంట్‌లో ఇద్దరు భారత పారా అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం.

ఈ స్వర్ణంతో కలిపి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు మూడు బంగారు పతకాలు గెలుచుకుంది.

అంతకుముందు మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్‌), షర్మిలా ధనకర్ (పారా అథ్లెటిక్స్‌-షాట్‌పుట్‌) కూడా భారత్‌కు స్వర్ణ పతకాలు అందించారు.

వివరాలు

శ్రీశంకర్‌కు వరుసగా రెండో రజతం

పురుషుల లాంగ్‌జంప్‌లో భారత స్టార్ మురళీ శ్రీశంకర్ మరోసారి తన నిలకడైన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆయనకు ఇది వరుసగా రెండో సిల్వర్ మెడల్ కావడం విశేషం.

బాక్సింగ్‌లో భారత్‌కు మరో ఆరు పతకాలు ఖాయం

భారత బాక్సర్లు కూడా అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు పతకాలు ఖాయం చేసుకున్న భారత బాక్సింగ్ జట్టు, తాజాగా మరో ఆరు పతకాలను కూడా ఖాయం చేసింది.

దీంతో ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు మొత్తం 10 పతకాలు ఖాయం చేసుకుని, గత కామన్వెల్త్ గేమ్స్‌లో నెలకొల్పిన రికార్డును అధిగమించారు.

ADVERTISEMENT

వివరాలు

సెమీస్‌కు అనిమేశ్.. ఫైనల్‌కు షాట్‌పుట్ ద్వయం

ఇక అథ్లెటిక్స్‌లో పురుషుల 200 మీటర్ల పరుగుపందెంలో భారత స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.

అలాగే పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో తజిందర్ పాల్ సింగ్ తూర్, సమర్‌దీప్ సింగ్ గిల్ ఫైనల్‌కు చేరుకుని భారత్‌కు మరో పతకంపై ఆశలు పెంచారు.

పతకాల పట్టికలో భారత్ స్థానం

ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మొత్తం 15 పతకాలున్నాయి. వీటిలో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి.

ఈ ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

ADVERTISEMENT