LOADING...
Rishabh Pant: న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు నేడే భారత జట్టు ప్రకటన.. పంత్‌ ఎంపికపై ఉత్కంఠ!
న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు నేడే భారత జట్టు ప్రకటన.. పంత్‌ ఎంపికపై ఉత్కంఠ!

Rishabh Pant: న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు నేడే భారత జట్టు ప్రకటన.. పంత్‌ ఎంపికపై ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పొట్టి ప్రపంచకప్‌ కోసం పూర్తిగా టీ20 లయలోకి వెళ్లే ముందు, భారత జట్టు చివరిసారిగా ఓ వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును సెలక్టర్లు శుక్రవారం ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపికపై ఆసక్తి నెలకొనగా, ముఖ్యంగా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు చోటు దక్కుతుందా లేదా అన్న అంశం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం పంత్‌ టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీ20 జట్టులో అతడికి స్థానం లేదు. వన్డే ఫార్మాట్‌లోనూ అతడు జట్టులోకి వస్తూ పోతూ ఉండటంతో స్థిరత్వం కనిపించడం లేదు. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో, వన్డేల్లో పంత్‌ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

Details

 ఆశించని స్థాయిలో రాణించని పంత్

అంతేకాదు ఈ ఫార్మాట్‌లో పంత్‌ ఫామ్‌ కూడా ఆశించిన స్థాయిలో లేదు. గత ఏడాది మొత్తం అతను ఒక్క వన్డే మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం. ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ పంత్‌ను ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో సత్తా చాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రిషబ్ పంత్‌, అక్కడ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆ టోర్నీలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 70, 22, 24 పరుగులు మాత్రమే చేశాడు.

Details

బుమ్రా, హర్దిక్ పాండ్యాలకు విశ్రాంతి?

ఈ నేపథ్యంలో మంచి ఫామ్‌లో ఉన్న ధ్రువ్‌ జురెల్‌ను రెండో వికెట్‌కీపర్‌గా ఎంపిక చేసి, పంత్‌ను ఈ సిరీస్‌కు పక్కన పెట్టొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. చివరికి సెలక్టర్ల నిర్ణయం ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. బ్యాటింగ్‌ విభాగంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సెంచరీలతో సత్తా చాటిన యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లను జట్టులో కొనసాగించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గాయం కారణంగా సఫారీలతో జరిగిన సిరీస్‌కు దూరమైన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ సిరీస్‌తో జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలకు ఈ వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

Details

మహ్మద్ షమీ పేరును పరిగణలోకి తీసుకొనే అవకాశం

దీంతో దక్షిణాఫ్రికాపై ఆడిన హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్న సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి పేరును సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. స్పిన్‌ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకే ప్రాధాన్యం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, వన్డే సిరీస్‌ అనంతరం జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఇప్పటికే ఎంపిక చేశారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన అదే జట్టును ఈ టీ20 సిరీస్‌లో కొనసాగించనున్నారు.

Advertisement