IND w VS SL w: సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత మహిళల జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం జరిగే చివరి టీ20 మ్యాచ్‌కు భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 2025 సంవత్సరాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్న భారత మహిళల జట్టు.. ఈ ఏడాదిని కూడా విజయంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సిరీస్‌లో మూడో, నాలుగో టీ20లకు ఆతిథ్యమిచ్చిన తిరువనంతపురం వేదికగానే చివరి మ్యాచ్ కూడా జరగనుంది.
Details
సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని శ్రీలంక
ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. నాలుగో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. అయినప్పటికీ ఫలితం మాత్రం మారలేదు. టీ20ల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసిన భారత్, సులువుగానే శ్రీలంకను ఓడించింది. అయితే గత మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ గణనీయంగా మెరుగుపడింది. 191 పరుగులు చేసి, టీ20ల్లో తమ జట్టు అత్యధిక స్కోర్‌ను నమోదు చేయడం విశేషం. సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనే లక్ష్యంతో ఉన్న లంక.. చివరి పోరులో అయినా ఫలితం మార్చగలదేమో చూడాలి.
Details
సూపర్ ఫామ్ లో షెఫాలి వర్మ
ప్రపంచకప్ ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలి వర్మ.. ఈ టీ20 సిరీస్‌లోనూ అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విధ్వంసకర అర్ధశతకం బాదింది. ఆరంభంలో ఫామ్ కోసం కొంచెం ఎదురుచూసిన స్మృతి మంధాన కూడా నాలుగో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన క్లాస్ చూపించింది. మిగతా బ్యాటర్లు కూడా మంచి లయలో ఉన్నారు. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఒక్కో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు బలాన్నిస్తున్నారు.