Olympics Committee: ఐఓసీ కీలక నిర్ణయం.. మహిళల విభాగంలో ట్రాన్స్‌జెండర్‌లకు నో ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఒలింపిక్ క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల భవిష్యత్తుపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సంచలనాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన ఇమానే ఖెలిఫ్, చైనీస్ తైపీకి చెందిన లిన్ యు-టింగ్‌లు మహిళా విభాగంలో స్వర్ణ పతకాలు గెలుచుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనల తరువాత ఐఓసీ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల అర్హతపై శాస్త్రీయ దర్యాప్తును ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం, 2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌కి ముందు మహిళల విభాగంలో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులను పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది.
Details
వివాదానికి కారణం ఏమిటి?
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు తమ టెస్టోస్టెరాన్ స్థాయిలు నిర్దేశిత పరిమితికి లోపులో ఉంటే మహిళా విభాగంలో పోటీ పడవచ్చు. అయితే, బాక్సింగ్ విభాగంలో ఇమానే ఖెలిఫ్, లిన్ యు-టింగ్‌లు స్వర్ణ పతకాలు గెలుచుకున్న తర్వాత పెద్ద వివాదం మొదలైంది. వీరిద్దరూ 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లింగ అర్హత పరీక్షల్లో విఫలమైనప్పటికీ, పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొని గెలవడం విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఐఓసీ వీరిపై కొత్త అర్హత పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోతే, వీరు మహిళా విభాగంలో ఇకపై పోటీ పడలేరు. అయితే, ఇద్దరు అథ్లెట్లు తాము సహజసిద్ధమైన మహిళలమేనని పదేపదే చెబుతున్నారు.
Details
నిషేధానికి కారణం
ఐఓసీ కొత్త అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ మహిళా క్రీడా విభాగాన్ని రక్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఈ నిషేధం వల్ల 2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ముందు తలెత్తే వివాదాలను నివారించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు వీసాలు ఇవ్వబోమని ప్రకటించిన నేపథ్యంలో, ఐఓసీ నిర్ణయం ఆ వివాదాన్ని కూడా తగ్గించగలదని చెబుతున్నారు.
Details
అమలు ఎప్పుడు?
ఈ కొత్త నిషేధాన్ని 2026 వింటర్ ఒలింపిక్స్‌కు ముందు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, కొత్త నిబంధనలు పూర్తిగా అమలులోకి రావడానికి కనీసం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం పట్టవచ్చని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, ఒలింపిక్ క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల పాల్గొనడంపై కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది