IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..!
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభ కానున్నాయి. నేడు ఈ వేదికపై డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ,జియో సినిమాలో ప్రత్యేకంగా ప్రసారం చేయనున్నారు. గుజరాత్ 14 మ్యాచ్‌లలో ఏడింటిని ఈ మైదానంలోనే ఆడనుంది. గతంలో మోటెరా స్టేడియంగా పిలిచే ఈ వేదిక 1,10,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం 2015లో ఈ స్టేడియం పునరుద్ధరణ తర్వాత 2021లో మళ్లీ పున:ప్రారంభించారు.
చైన్నైపై గుజరాత్‌కు మెరుగైన రికార్డు
ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మంచు కారణంగా బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంటుంది.ఈ వేదికపై ఇప్పటివరకు 10 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఆరుసార్లు గెలుపొందింది. ఈ వేదికపై కేవలం నాలుగు సార్లు మాత్రమే 200 ప్లస్ స్కోరు నమోదైంది. అంజిక్య రహానే ఈ మైదానంలో అత్యధికంగా 47.22 సగటుతో 425 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ 111.50 సగటుతో 223 పరుగులు, హార్దిక్‌పాండ్యా ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడి 6.17 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ మైదానంలో చైన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ధోని మ్యాజిక్ చేసి గెలుస్తారేమో వేచి చూడాలి.