
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. అదే జరిగితే బౌలర్లకు పండగేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్‌లో పాల్గొనే బౌలర్లకు బీసీసీఐ శుభవార్త అందించనుంది.
ప్రస్తుతానికి అమల్లో ఉన్న సలైవా వినియోగ నిషేధాన్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో బౌలర్లు లాలాజలాన్ని ఉపయోగించి బంతిని మెరిసేలా చేసుకుని, రివర్స్ స్వింగ్ సాధించేవారు.
అయితే, కరోనా మహమ్మారి ప్రభావంతో ఐసీసీ దీనిపై నిషేధం విధించింది. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ అదే నిషేధాన్ని కొనసాగించారు.
ప్రస్తుతం కరోనా ముప్పు లేకపోవడంతో, ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని బీసీసీఐ యోచిస్తోంది.
గురువారం జరగనున్న కెప్టెన్ల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కెప్టెన్లు అందరూ ఏకాభిప్రాయానికి వస్తే, నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది.
వివరాలు
బౌలర్ల డిమాండ్ ఇదే..
గతంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సైతం సలైవా వినియోగంపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఐసీసీని కోరాడు.
సలైవా వినియోగం లేకుండా బౌలర్లకు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని, ఇది పూర్తిగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుందని షమీ అభిప్రాయపడ్డాడు.
రివర్స్ స్వింగ్ ద్వారా ఆటను ఆసక్తికరంగా మార్చే అవకాశం ఉందని, అందుకే నిషేధాన్ని తొలగించాలని కోరాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నన్ ఫిలాండర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌతి సహా పలువురు ఆటగాళ్లు కూడా ఇదే డిమాండ్ చేశారు.
ఐసీసీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, ఐపీఎల్‌లో నిషేధాన్ని ఎత్తివేస్తే బౌలర్లకు ఊరట కలుగనుంది. దీంతో బ్యాట్-బంతి పోరాటం మరింత రసవత్తరంగా మారనుంది.
వివరాలు
కొత్త నిబంధనలు వస్తాయా?
ప్రస్తుతం ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌ను అవుట్, నాటౌట్, నోబాల్, వైడ్ బాల్ నిర్ణయాలకు మాత్రమే వినియోగిస్తున్నారు.
కానీ, ఈ సీజన్ నుండి హైట్ వైడ్ బాల్ కోసం కూడా డీఆర్‌ఎస్‌ను అనుమతించనున్నట్లు సమాచారం.
బ్యాటర్‌ను అధిగమించి ఎక్కువ ఎత్తుకు వెళ్లిన బంతిని వైడ్‌గా పరిగణించాలా? లేదా? అన్నది డీఆర్‌ఎస్ ద్వారా ఖరారు చేయనున్నారు.
దీని వల్ల ఆట మరింత ఆసక్తికరంగా మారనుంది. కెప్టెన్ల సమావేశంలో దీనిపై కూడా చర్చించే అవకాశముంది.
వివరాలు
మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం..
ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య జరుగనుంది.
ఈసారి మొత్తం 65రోజుల పాటు 13వేదికల్లో 10జట్లు పోటీపడనున్నాయి.టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరుగుతాయి, అందులో 70 లీగ్ మ్యాచులు, 4 ప్లే ఆఫ్ మ్యాచులు ఉంటాయి.
ఫైనల్‌తో సహా ప్లే ఆఫ్ మ్యాచులు మే 20 నుంచి 25 వరకు హైదరాబాద్, కోల్‌కతాలో జరుగనున్నాయి.
క్వాలిఫయర్-1,ఎలిమినేటర్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది,క్వాలిఫయర్-2,ఫైనల్ మ్యాచ్‌లు కోల్‌కతాలో నిర్వహించనున్నారు.
ఈ సీజన్‌లో మొత్తం 12డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి.మధ్యాహ్నం 3:30 గంటలకు తొలి మ్యాచ్, రాత్రి 7:30 గంటలకు రెండో మ్యాచ్ ప్రారంభం కానున్నాయి.