LOADING...
IPL 2026 : వద్దు బాబోయ్ వద్దు.. ఆ రూల్‌ వద్దు..'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'పై కెప్టెన్ల అసంతృప్తి
వద్దు బాబోయ్ వద్దు.. ఆ రూల్‌ వద్దు..'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'పై కెప్టెన్ల అసంతృప్తి

IPL 2026 : వద్దు బాబోయ్ వద్దు.. ఆ రూల్‌ వద్దు..'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'పై కెప్టెన్ల అసంతృప్తి

వ్రాసిన వారు Moogati Shabari
Mar 26, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ 2023 సీజన్‌లో అమల్లోకి తీసుకొచ్చిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఈ నియమంపై ఎక్కువ మంది జట్టు కెప్టెన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 19వ ఎడిషన్‌కు ముందు ముంబైలో బీసీసీఐ నిర్వహించిన కెప్టెన్సీ సమావేశంలో చాలా మంది సారథులు ఈ నిబంధనపై తమ అభ్యంతరాలు వెల్లడించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. బీసీసీఐ నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న కెప్టెన్లలో మెజారిటీ ఈ నియమానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ నిబంధనను 2027 వరకు కొనసాగించాలని నిర్ణయించినందున, 20వ సీజన్ అనంతరం మాత్రమే దీనిపై సమీక్ష చేపట్టనున్నట్లు ఐపీఎల్‌కు చెందిన ఒక అధికారి వెల్లడించాడు.

వివరాలు 

ఆటగాళ్లకు నచ్చని నియమం ఇదేనా?

ముంబైలోని సమావేశంలో 'ఇంపాక్ట్ ప్లేయర్'తో పాటు 'బాల్ మార్పు' నియమం, 'ట్రైనింగ్ మార్గదర్శకాలు' వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఒక ఆల్‌రౌండర్‌గా ఈ నియమానికి తాను వ్యతిరేకం అని అన్నారు. అయినప్పటికీ నిబంధనలను గౌరవిస్తూ పాటిస్తున్నామని స్పష్టం చేశాడు. గతంలో రోహిత్ శర్మ కూడా ఈ నియమం భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంతమంది వ్యతిరేకిస్తున్న ఈ నియమంపై వచ్చే సీజన్‌లో అయినా బీసీసీఐ మార్పులు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

వివరాలు 

బాల్ మార్చడం వల్ల నష్టమా? లాభమా?

గత సీజన్‌లో బీసీసీఐ ప్రవేశపెట్టిన 'బాల్ ఛేంజ్' నియమాన్ని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అమలు చేయాలని కొందరు కెప్టెన్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో పదో ఓవర్ తర్వాత మాత్రమే బంతిని మార్చుకునే అవకాశం ఉంది. దీనిని తొలి ఇన్నింగ్స్‌కూ వర్తింపజేయాలని కోరినా, అందరికీ అనుకూలంగా లేకపోవడంతో పూర్తి స్థాయి ఆమోదం లభించలేదని సమాచారం. అదనంగా బీసీసీఐ ఇటీవల విడుదల చేసిన ట్రైనింగ్ మార్గదర్శకాలపై కూడా కెప్టెన్లు మరింత స్పష్టత కోరినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు 

ఈసారి పూర్తిగా భారత కెప్టెన్లే

పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినప్పటికీ, గతంలో జట్లకు విదేశీ ఆటగాళ్లు, అంతర్జాతీయ కెప్టెన్లు నాయకత్వం వహించేవారు. 2008లో ప్రారంభమైన తొలి సీజన్ నుంచి 2025 వరకు జరిగిన కెప్టెన్సీ సమావేశాల్లో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా తమ ఫ్రాంచైజీల తరఫున హాజరయ్యేవారు. అయితే ఈ సీజన్‌లో మాత్రం అన్ని పది జట్లకు భారతీయులే కెప్టెన్లుగా ఉండటం ప్రత్యేకంగా నిలిచింది.

Advertisement