LOADING...
IPL 2026 : ఐపీఎల్ 2026కి ముందు ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
ఐపీఎల్ 2026కి ముందు ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

IPL 2026 : ఐపీఎల్ 2026కి ముందు ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది. మరో రెండు వారాల్లో ఈ ప్రతిష్టాత్మక లీగ్ మొదలుకానుండగా, అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను సమర్థంగా సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే టోర్నీ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనుకోని సమస్య ఎదురైంది. జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో బాధపడుతుండటంతో ప్రారంభ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో అతని స్థానంలో టీమిండియా ఆగ్రెసివ్ బ్యాటర్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు

కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

కమిన్స్ పరిస్థితిని పరిశీలిస్తే, గతంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతను వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో కేవలం ఒకటే టెస్టు మ్యాచ్ ఆడగలిగాడు. అదే విధంగా టీ20 వరల్డ్ కప్‌లో కూడా అతను పాల్గొనలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ దశలో అతను జట్టుకు అందుబాటులో ఉండడం సందేహంగా మారింది. అందుకే ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం అతని స్థానంలో భారత్ జట్టుకు చెందిన దూకుడు బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇషాన్‌తో పాటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పేర్లు కూడా చర్చలో ఉన్నప్పటికీ, కిషన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అందరి చూపు అతని వైపే..

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పోలిస్తే ఇషాన్ కిషన్ నాయకత్వానికి మరింత సరిపోతాడని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కారణం, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతని సారథ్యంలో ఝార్ఖండ్ జట్టు తొలిసారి విజేతగా నిలవడం. అంతేకాకుండా భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి కూడా అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కమిన్స్ తిరిగి జట్టులో చేరే వరకు తాత్కాలికంగా ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం జట్టుకు మేలు చేస్తుందని యాజమాన్యం అభిప్రాయపడుతోంది. కాగా 2025 మెగా వేలంలో ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ రూ.11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను తమ జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement