LOADING...
IPL 2026: కొత్త జెర్సీలు.. కొత్త సవాళ్లు.. సంజు-జడేజా స్పెషల్‌ మ్యాచ్
కొత్త జెర్సీలు.. కొత్త సవాళ్లు.. సంజు-జడేజా స్పెషల్‌ మ్యాచ్

IPL 2026: కొత్త జెర్సీలు.. కొత్త సవాళ్లు.. సంజు-జడేజా స్పెషల్‌ మ్యాచ్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 30, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ విషయానికి వస్తే, సంజు శాంసన్‌ పేరు వినగానే గులాబీ జెర్సీనే గుర్తుకొస్తుంది. అదే విధంగా రవీంద్ర జడేజా అంటే పసుపు జెర్సీ గుర్తుకు వస్తుంది. అయితే ఈ సీజన్‌లో ఈ ఇద్దరినీ విభిన్న జట్ల దుస్తుల్లో చూడబోతున్నాం. ఇప్పటివరకు రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజు శాంసన్‌ ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి మారాడు. అలాగే చాలా సంవత్సరాలుగా చెన్నై జట్టుకు ఆడిన రవీంద్ర జడేజా ఈసారి రాజస్థాన్‌ జట్టులో కనిపించనున్నాడు.

వివరాలు 

ధోనికి గాయం..చెన్నైకు పెద్ద నష్టమే..

సోమవారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య పోరు జరగనుంది. గత సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శనతో పదో స్థానంలో ముగించి ఐదుసార్లు టైటిల్‌ గెలుచుకున్న చెన్నై జట్టు, ఈసారి మళ్లీ పాత స్థాయిని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మహేంద్ర సింగ్‌ ధోనీకి గాయం కావడంతో ఆయన రెండు వారాలపాటు టోర్నీకి దూరంగా ఉండటం జట్టుకు ఒక పెద్ద ప్రతికూలతగా మారింది. దీంతో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై బాధ్యత మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఈసారి మరింత దూకుడుగా ఆడి టైటిల్ కైవశం చేసుకోవాలని చూస్తోంది.

వివరాలు 

బలహీనంగా బౌలింగ్..

ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఫామ్‌లో ఉన్న భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే, అలాగే ఉర్విల్‌ పటేల్‌, శివమ్‌ దూబే వంటి ఆటగాళ్లతో చెన్నై బ్యాటింగ్‌ లైన్‌అప్‌ బలంగా కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ కనబరిచిన యువ ఆటగాళ్లు ప్రశాంత్‌ వీర్‌, కార్తీక్‌ శర్మ ఈ వేదికపై ఎలా రాణిస్తారో చూడాలి. దక్షిణాఫ్రికాకు చెందిన యువ ప్రతిభ డెవాల్డ్‌ బ్రెవిస్‌ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమవడం చెన్నైకి మరో లోటుగా మారింది. బౌలింగ్‌ విభాగంలో మాత్రం ఆ జట్టు కొంత బలహీనంగా కనిపిస్తోంది. ఖలీల్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌, మ్యాట్‌ హెన్రీ, రాహుల్‌ చాహర్‌, ముకేశ్‌ చౌదరి ఎలా ప్రదర్శిస్తారన్నది కీలకంగా మారనుంది.

Advertisement

వివరాలు 

విజయం కోసం చూస్తున్న రాజస్థాన్ రాయల్స్ 

ఇక గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి రియాన్‌ పరాగ్‌ నాయకత్వంలో తిరిగి మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. యశస్వి జైశ్వాల్‌, యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ జట్టుకు ప్రధాన బలాలుగా ఉన్నారు. అయితే రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌లలో నిలకడ లోపం ఒక సమస్యగా ఉంది. మిడిల్‌ ఆర్డర్‌లో హెట్‌మయర్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫామ్‌ కోసం కష్టపడుతున్న రవీంద్ర జడేజా తన అనుభవంతో జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి. బౌలింగ్‌ విభాగంలో జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌లపై ఎక్కువ బాధ్యత ఉంటుంది.

Advertisement