LOADING...
IPL 2026: కొత్త జోష్‌తో పంజాబ్... టైటిల్ మిషన్ సక్సెస్ అవుతుందా?
కొత్త జోష్‌తో పంజాబ్... టైటిల్ మిషన్ సక్సెస్ అవుతుందా?

IPL 2026: కొత్త జోష్‌తో పంజాబ్... టైటిల్ మిషన్ సక్సెస్ అవుతుందా?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 23, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో 18 ఏళ్లుగా పోరాడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే జట్టులో ప్రతిభావంతుల కొరత ఏమీ లేదు. అయినా సరే స్థిరత్వం లేకపోవడం వల్ల కీలక దశల్లో ఆగిపోవడం ఈ జట్టు కథగా మారింది. వరుసగా 11 సీజన్ల పాటు ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయిన ఈ జట్టు, గత సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో అద్భుతంగా ఆడి ఫైనల్‌ చేరింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం టైటిల్ గెలవాలని పంజాబ్ దృఢంగా సంకల్పించింది.

వివరాలు

గత ప్రయాణం ఇలా..

2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ టాప్-4లో నిలిచింది. కానీ ఆ తర్వాత 2014 వరకూ లీగ్ దశనే దాటలేకపోయింది. 2014లో మొదటిసారి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ జట్టు ప్రదర్శన దిగజారింది. లీగ్ దశలోనే నిష్క్రమించడం అలవాటైంది. మళ్లీ ప్లేఆఫ్స్‌కు చేరడానికి దాదాపు పదేళ్లు పట్టింది. 2024లో శిఖర్ ధావన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి జట్టులో భారీ మార్పులు చేసింది. శ్రేయస్ అయ్యర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అలాగే ట్రెవర్ బేలిస్ స్థానంలో రికీ పాంటింగ్‌ను కోచ్‌గా నియమించింది. ఈ మార్పులు మంచి ఫలితాన్నిచ్చాయి. జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరినా చివరి మెట్టుపై ఓటమి పాలైంది.

వివరాలు

బలాలు ఇవే..

పంజాబ్‌కు ప్రధాన బలం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. మ్యాచ్ పరిస్థితిని మార్చగల సామర్థ్యం అతనికి ఉంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించగలడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పలు ఎంపికలు ఉండటం జట్టుకు అనుకూలం. అవసరాన్ని బట్టి బ్యాటింగ్ క్రమాన్ని మార్చుకునే సామర్థ్యం ఉంది. స్టోయినిస్, అజ్మతుల్లా, యాన్సెన్ వంటి ఆల్‌రౌండర్లు జట్టుకు బలాన్నిస్తారు. చాహల్, అర్ష్‌దీప్, ఫెర్గూసన్‌ల అనుభవం కూడా కీలకం. ముఖ్యంగా చాహల్ స్పిన్ బౌలింగ్ జట్టుకు పెద్ద ఆస్తి. దేశీయ ఆటగాళ్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్ గత సీజన్‌లో కీలక పాత్ర పోషించి జట్టుకు బలాన్ని చేకూర్చారు.

Advertisement

వివరాలు

బలహీనతలు ఇవే..

శ్రేయస్ అయ్యర్ గాయాల సమస్య జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో గాయపడిన అతను కొంతకాలం జట్టుకు దూరమయ్యాడు. తిరిగి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తాజాగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన అతను ఐపీఎల్‌లో ఎలా ఆడతాడో చూడాలి. జట్టులో ప్రతిభ ఉన్నప్పటికీ కీలక సమయాల్లో సమష్టిగా రాణించలేకపోవడం పెద్ద లోపం. మ్యాచ్ విన్నర్లు ఉన్నా సరైన సమన్వయం లేకపోవడం సమస్యగా మారింది. ఫెర్గూసన్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం మరో మైనస్. అతని స్థానాన్ని భర్తీ చేసే బౌలర్‌పై సందేహాలు ఉన్నాయి. అర్ష్‌దీప్ ప్రతిభావంతుడే అయినా స్థిరత్వం లోపిస్తోంది. స్టోయినిస్ కూడా గతం లాంటి ఫామ్‌లో లేడు.

Advertisement