Shubman Gill Catch : గిల్ వన్ మ్యాన్ షో.. చెన్నై ప్యాకప్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా, ఫీల్డింగ్‌లో సూపర్ క్యాచ్, అద్భుత రనౌట్‌తో మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ పోరులో గుజరాత్ 89 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించగా, గుజరాత్ ప్లేఆఫ్స్‌లో టాప్-2 అవకాశాలను మరింత బలపర్చుకుంది.
వివరాలు
జట్టుకు బలమైన ఆరంభం..
ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాట్‌తో 64 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. అయితే అతని అసలైన మ్యాజిక్ ఫీల్డింగ్‌లో కనిపించింది. చెన్నై ఇన్నింగ్స్ సమయంలో స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ ధూబే దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో ప్రమాదకరంగా మారిన దూబేను గిల్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రషీద్ ఖాన్ వేసిన బంతిని దూబే భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాక కవర్స్ వైపు గాల్లోకి లేచింది.
వివరాలు
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్..
అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గిల్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి, గాల్లోకి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఈ సూపర్ క్యాచ్ చూసి స్టేడియంలోని అభిమానులు ఉత్సాహంతో అరవగా, చెన్నై బ్యాటర్లు కూడా షాక్‌కు గురయ్యారు. వికెట్ పడిన వెంటనే గిల్ చేసిన అగ్రెసివ్ సెలబ్రేషన్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అంతకుముందు గిల్ చేసిన రనౌట్ కూడా చెన్నైకి భారీ దెబ్బగా మారింది. కార్తీక్ సింగిల్ కోసం ప్రయత్నించగా, గిల్ మెరుపువేగంతో డైరెక్ట్ హిట్ కొట్టాడు. అతను విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకడంతో కార్తీక్ శర్మ 19 పరుగుల వద్దే ఔటయ్యాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్ రెండింట్లోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ జట్టును ముందుండి నడిపించాడు.
వివరాలు
స్వల్ప స్కోరుకే సీఎస్కే ఆలౌట్..
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 229 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గిల్ 64 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో జోష్ బట్లర్ కేవలం 27 బంతుల్లోనే 57 పరుగులతో చెలరేగిపోయాడు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. మహమ్మద్ సిరాజ్, రగడ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీసి చెన్నై బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. దీంతో చెన్నై జట్టు 140 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.