LOADING...
IPL 2026 : ఈసారి కూడా కప్పు పాయే.. డబ్బులు పెట్టుకొని మ్యాచ్ విన్నర్లను వదిలేసిన కావ్య పాపా.. 
ఈసారి కూడా కప్పు పాయే..

IPL 2026 : ఈసారి కూడా కప్పు పాయే.. డబ్బులు పెట్టుకొని మ్యాచ్ విన్నర్లను వదిలేసిన కావ్య పాపా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
07:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న నిర్ణయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. చేతిలో భారీగా రూ. 25.5 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ,మ్యాచ్ ఫలితాన్ని తిప్పగలిగే కీలక ఆటగాళ్లను వదిలేసింది. ఒకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ ధరలకే మ్యాచ్ విన్నర్లను దక్కించుకుంటూ ముందుకెళ్లగా, మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం కేవలం ప్రేక్షకుల్లా మిగిలిపోయింది. చివరికి ముంబై ఇండియన్స్ కేవలం రూ. 2.50 కోట్ల పర్సుతో వేలంలోకి వచ్చి, రూ. 1 కోట్లకే క్వింటన్ డికాక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం పూర్తిగా మౌనంగా వ్యవహరించింది. వేలం ప్రారంభమైన మొదటి రెండు గంటల పాటు ఒక్క ఆటగాడినీ కూడా కొనుగోలు చేయలేదు.

వివరాలు 

 అన్‌సోల్డ్‌గా లియామ్ లివింగ్‌స్టోన్

ప్రస్తుతం జట్టుకు ఒక నాణ్యమైన స్పిన్నర్‌తో పాటు ఓ నమ్మకమైన ఫినిషర్ అవసరం ఉన్నప్పటికీ, ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు దారి తీసింది. వేలానికి ముందు రవి బిష్ణోయ్,లియామ్ లివింగ్‌స్టోన్, మతీశ పతిరణ, డేవిడ్ మిల్లర్‌లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ నలుగురినీ జట్టులోకి తీసుకోవడంలో విఫలమైంది. డేవిడ్ మిల్లర్ కేవలం రూ. 2 కోట్లకే అమ్ముడుపోగా, అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. లియామ్ లివింగ్‌స్టోన్ మాత్రం ఎవరూ కొనకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. మతీశ పతిరణ విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అస్సలు బిడ్డింగ్ చేయలేదు.

వివరాలు 

బిష్ణోయ్ ను రాజస్థాన్ రాయల్స్ 7.20 కోట్లకు సొంతం

బిష్ణోయ్ కోసం మాత్రమే వేలం పాడింది. అయితే రూ.7 కోట్ల వరకు మాత్రమే పాడింది. చేతిలో రూ. 25.5 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, బిష్ణోయ్ కోసం గట్టిగా ప్రయత్నించకపోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 7.20 కోట్లకు సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రస్తుతం నాణ్యమైన స్పిన్నర్ అత్యవసరం. గత సీజన్‌లో ఉన్న ఆడం జంపా, రాహుల్ చహర్‌లను జట్టు వదిలేసింది. ప్రస్తుతం జీషాన్ అన్సారీ ఒక్కరే స్పిన్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే అతడికి అనుభవం తక్కువగా ఉండటంతో, వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న బౌలర్ జట్టుకు అవసరమవుతోంది.

Advertisement

వివరాలు 

సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది

ఆ సామర్థ్యం రవి బిష్ణోయ్‌లో స్పష్టంగా ఉన్నప్పటికీ, కొంచెం ఎక్కువగా ప్రయత్నించి ఉంటే అతడిని రూ. 12 కోట్లలోపే దక్కించుకునే అవకాశం ఉండేది. ఇంకా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక టాప్ స్థాయి స్పిన్నర్‌తో పాటు, మరో క్లాస్ పేసర్ జట్టుకు అవసరం. కానీ ఇప్పటి వరకు వేలంలో ఆ దిశగా ఎలాంటి స్పష్టమైన అడుగులు వేయలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే, గుర్తింపు లేని ఆటగాళ్లపైనే జట్టు ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ లియామ్ లివింగ్‌స్టోన్‌ను తిరిగి వేలంలోకి తీసుకువచ్చి అతడిని సొంతం చేసుకుంటే జట్టుకు మంచి బలం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

వివరాలు 

రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పతిరణ

ఇక మతీశ పతిరణను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అతడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర పోటీ చూపించినప్పటికీ, చివరకు కేకేఆర్ పైచేయి సాధించింది. ఈ వేలంలో ఇప్పటివరకు రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పతిరణ నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఈ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 25.20 కోట్లకు సొంతం చేసుకుంది.

Advertisement