IPL Auction: అబుదాబి వేదికగా ఐపీఎల్ వేలం!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం అబుదాబిలో జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విదేశాల్లో వరుసగా ఇది మూడో సంవత్సరం ఐపీఎల్ వేలం జరుగనుంది. 2023లో దుబాయ్‌లో, 2024లో జెడ్డాలో వేలం నిర్వహించగా, ఈసారి డిసెంబరు 15 లేదా 16వ తేదీల్లో అబుదాబి వేదిక కానుంది. ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంచలన మార్పు ఖాయమని సమాచారం. ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు బదిలీ అవుతున్నట్లు తెలిసింది. రాజస్థాన్ ఫ్రాంఛైజీ ఈ మార్పుకు అంగీకరించగా, ప్రతిగా చెన్నై నుంచి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను పొందనుంది.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
ఆటగాళ్లిద్దరూ కూడా జట్టు మార్పుకు తమ సమ్మతి తెలిపినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ట్రేడ్ ఒప్పందంపై బీసీసీఐ ఆమోదం అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరోవైపు సామ్ కరన్ బదిలీకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం (NOC) అందిన వెంటనే ఫ్రాంఛైజీలు బీసీసీఐకి తుది సమాచారం ఇవ్వనున్నాయి. ఈ లావాదేవీతో రాబోయే ఐపీఎల్ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.