LOADING...
Uppal Stadium : హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ హెచ్చరిక
హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ హెచ్చరిక

Uppal Stadium : హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ హెచ్చరిక

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మల్కాజిగిరి పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఉప్పల్-హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి ఉప్పల్, అంబర్‌పేట్ వైపు వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

వివరాలు

వాహనదారులకు హై అలెర్ట్..

వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు కనీసం గంట ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని తెలిపారు. జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో గేటు మ్యాప్ సదుపాయం అందుబాటులో ఉందని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ గేటును సులభంగా గుర్తించవచ్చని చెప్పారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులను తప్పనిసరిగా అనుసరించాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్‌ను పరిశీలించాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు తెలిపారు.

వివరాలు

కోహ్లీ కోసం ఎగబడుతున్న జనం..

ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉప్పల్ స్టేడియంలో ఇది చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో టికెట్ల కోసం భారీ ఆసక్తి నెలకొంది. మరోవైపు విరాట్ కోహ్లీ ఆడుతున్న ఆర్సీబీ జట్టు కూడా కావడంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయినప్పటికీ అభిమానులు ఇంకా టికెట్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భారీ మొత్తాలు చెల్లించైనా మ్యాచ్ చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

వివరాలు

మెట్రో సేవలు పొడిగింపు..

దీంతో బ్లాక్ టికెట్ల విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. మ్యాచ్ వీక్షించి వెళ్లే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement