LOADING...
Cameron Green: క్రానిక్‌ కిడ్నీ వ్యాధిని జయించిన కామెరూన్‌ గ్రీన్
Cameron Green: క్రానిక్‌ కిడ్నీ వ్యాధిని జయించిన కామెరూన్‌ గ్రీన్

Cameron Green: క్రానిక్‌ కిడ్నీ వ్యాధిని జయించిన కామెరూన్‌ గ్రీన్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ డొనాల్డ్‌ గ్రీన్‌ భారీ సంచలనం సృష్టించాడు. రూ.2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన గ్రీన్‌ కోసం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి కోల్‌కతా రూ.25.20 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి అతడిని తమ జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ నిలిచాడు. మొత్తంగా చూస్తే ఐపీఎల్‌లో మూడో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఐపీఎల్‌-2023 వేలంలో అతడిని ముంబయి ఇండియన్స్‌ రూ.17.50 కోట్లకు దక్కించుకోగా, ఆ తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ట్రేడ్‌ అయ్యాడు.

వివరాలు 

 60 శాతం మాత్రమే పనిచేస్తున్న కిడ్నీలు 

అయితే కామెరూన్‌ గ్రీన్‌.. పుట్టుక నుంచే క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని గ్రీన్‌ 2023లోనే బహిరంగంగా వెల్లడించాడు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా పుట్టినప్పుడే తనకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉందని వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారని అతడు తెలిపాడు. ఈ వ్యాధి వల్ల కిడ్నీల పనితీరు ప్రభావితమవుతుందని, తన కిడ్నీలు సాధారణ వ్యక్తుల్లా రక్తాన్ని శుద్ధి చేయలేవని చెప్పాడు. ప్రస్తుతం అవి కేవలం 60 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, వ్యాధి రెండో దశలో ఉందని గ్రీన్‌ వివరించాడు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా వెల్లడించాడు.

వివరాలు 

గ్రీన్‌ 12 ఏళ్లకు మించి జీవించడమూ కష్టమే..

అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అదృష్టవశాత్తు ఇతరుల మాదిరిగా తాను శారీరకంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోలేదని గ్రీన్‌ చెప్పాడు. తన ఆరోగ్య సమస్య గురించి జట్టులోని కొందరికి, కోచింగ్‌ సిబ్బందికి ముందుగానే తెలియజేశానని, ఆహారపు అలవాట్లపై కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అవగాహన ఉందని అప్పటి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. గ్రీన్‌ తల్లి టార్సీ 19 వారాల గర్భవతిగా ఉన్న సమయంలో చేసిన స్కానింగ్‌లోనే ఈ సమస్య బయటపడింది. ఆ సమయంలో గ్రీన్‌ 12 ఏళ్లకు మించి జీవించడమూ కష్టమేనని వైద్యులు చెప్పినట్లు అతడి తండ్రి గ్యారీ గుర్తు చేశాడు.

Advertisement

వివరాలు 

ఆల్‌రౌండర్

అయితే అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ, మృత్యువునే జయించిన గ్రీన్‌ నేడు ప్రపంచ క్రికెట్‌లో ప్రముఖ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందుతూ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌-2026లో అతడి ప్రదర్శన ఎలా ఉండబోతుందన్నదానిపై క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు గ్రీన్‌ 29 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి, 41.6 సగటుతో 153.7 స్ట్రైక్‌ రేట్‌ వద్ద 707 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఒక శతకం, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 9.08 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టి తన ఆల్‌రౌండర్‌ సామర్థ్యాన్ని నిరూపించాడు.

Advertisement