
BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!
ఈ వార్తాకథనం ఏంటి
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది.
పాక్ దాడుల భయంతో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, భద్రతాపరమైన కారణాలతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
మ్యాచ్ నిలిపివేయడం క్రమంలో, బీసీసీఐ వెంటనే చర్యలు తీసుకుంది. ఇరుజట్ల ఆటగాళ్లు, కామెంటేటర్లు, బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది తదితరులను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేక వందే భారత్ హైస్పీడ్ రైలును ఏర్పాటు చేసింది.
దాదాపు 300 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఐని ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది.
Details
ప్రేక్షకులను సురక్షితంగా తరలించిన సిబ్బంది
గురువారం టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకోగా, వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ భద్రతాపరమైన కారణాలతో ప్లడ్ లైట్లు ఆగిపోవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.
ఈ క్రమంలో టెక్నికల్ ఇష్యూలను కూడా బోర్డు స్పష్టంగా పేర్కొంది. దీంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయక తప్పలేదు.
తర్వాత స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను సురక్షితంగా తరలించి, మైదానాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆపరేషన్‌పై పర్యవేక్షణ కొనసాగించారు.
ఈ ఘటన నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై భద్రతా దృష్టితో మరింత అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.