The Hundred: సన్‌రైజర్స్ జట్టుకు ఈసారి అబ్రార్ అహ్మద్ దూరం?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌లో నిర్వహించే ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమైన సన్ గ్రూప్ కు చెందిన సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడం వివాదానికి దారితీసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదే యాజమాన్యం ఉండటంతో పాకిస్థాన్ క్రికెటర్‌ను ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అభిమానులు ఎస్‌ఆర్‌హెచ్‌ను తప్పించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
Details
పీసీబీ నుంచి ఎన్‌వోసీ రాలేదు
అయితే ఈ సీజన్‌లో అబ్రార్ అహ్మద్ ది హండ్రెడ్ లీగ్‌లో ఆడే అవకాశాలు అనిశ్చితంగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అతడికి పీసీబీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) రాలేదు. అదే సమయంలో ఇంగ్లాండ్‌లో లీగ్ జరుగుతున్న సమయంలోనే పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అబ్రార్‌కు ఎన్‌వోసీ ఇవ్వకూడదనే అభిప్రాయం పాక్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీబీ వర్గాల ప్రకారం, "ది హండ్రెడ్ లీగ్‌లో అబ్రార్ ఆడకపోవచ్చు. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Details
అబ్రార్ పేరు ది హండ్రెడ్ వేలంలో నమోదు
వేలంలో పాల్గొంటే మంచి మొత్తం వస్తుందని భావించి అతడి ఏజెంట్ అబ్రార్ పేరును ది హండ్రెడ్ వేలంలో నమోదు చేశాడు. పీసీబీ నుంచి ఎన్‌వోసీ వస్తుందని అతడు ఆశిస్తున్నాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా అబ్రార్ ఈ లీగ్‌లో ఆడే అవకాశాలు ప్రస్తుతం 50-50గా మాత్రమే ఉన్నాయి. ఎన్‌వోసీ ఇవ్వకపోతే ఈసారి లీగ్‌లో ఆడే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ ఏడాది ది హండ్రెడ్ లీగ్ జులై 21నుంచి ఆగస్ట్ 16వరకు జరగనుంది. ఇదే సమయంలో పాకిస్థాన్ జట్టు జులై 15న వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్ట్ 7 వరకు రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. దీంతో అబ్రార్ అహ్మద్ లీగ్‌లో ఆడతాడా లేదా అన్నది పీసీబీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.