Loading...
Harshit Rana: దూకుడే హర్షిత్ రాణాకు సమస్యగా మారుతోందా?.. ఆల్‌రౌండర్‌గా ఎదగాలంటే మారాల్సిందే!
దూకుడే హర్షిత్ రాణాకు సమస్యగా మారుతోందా?.. ఆల్‌రౌండర్‌గా ఎదగాలంటే మారాల్సిందే!

Harshit Rana: దూకుడే హర్షిత్ రాణాకు సమస్యగా మారుతోందా?.. ఆల్‌రౌండర్‌గా ఎదగాలంటే మారాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పేస్ ఆల్‌రౌండర్‌గా హర్షిత్ రాణా (Harshit Rana)పై భారత జట్టు మేనేజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. తన దూకుడైన స్వభావంతో పోటీని ఇష్టపడే ఈ యువ క్రికెటర్.. ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఇప్పుడే కాదు.. ఐపీఎల్‌తోపాటు దేశవాళీ క్రికెట్‌లోనూ అతడి తీరు ఇలాగే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ప్రత్యర్థులకు మాటకు మాట బదులిస్తుంటాడు. పాక్ ఆటగాళ్లతో వాగ్వాదం నేపథ్యంలో హర్షిత్ దూకుడుపై మరోసారి చర్చ మొదలైంది.

వివరాలు

ఆల్‌రౌండర్‌ పాత్ర కోసం..

రెండేళ్ల కిందట టీమిండియా తరఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా.. ఇప్పటివరకు రెండు మ్యాచులే ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు సమర్పించుకోవడంతోపాటు గాయాల బారిన పడటంతో మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో భారత పరిమిత ఓవర్ల జట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అతడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. గత ఏడాది వన్డేలు, టీ20ల్లోకి అడుగుపెట్టిన హర్షిత్.. చివరిసారిగా ఇంగ్లాండ్ పర్యటనలో ఆడాడు. ఆ తర్వాత మరోసారి గాయాల బారిన పడ్డాడు. ప్రస్తుతం ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్‌తో మళ్లీ మైదానంలోకి వచ్చాడు.

వివరాలు

తొలి నుంచీ అదే దూకుడు..

ఇప్పటివరకు భారత్ తరఫున రెండు టెస్టులు, 14 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. లోయర్ ఆర్డర్‌లోనూ పరుగులు చేయగలడనే నమ్మకం మేనేజ్‌మెంట్‌కు ఉంది.

అందుకే అతడిని సమర్థవంతమైన పేస్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తోంది.

ప్రత్యర్థి బ్యాటర్లను బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టడమే కాదు.. మైదానంలో మాటల యుద్ధానికి కూడా హర్షిత్ వెనుకాడడు. ఈ స్వభావం టీమ్‌ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరించాడు. రెండేళ్ల కిందట కేకేఆర్ తరఫున ఆడుతున్న సమయంలో హైదరాబాద్ బ్యాటర్ మనీశ్ పాండే ఔటైనప్పుడు అతడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.

ADVERTISEMENT

వివరాలు

అప్పట్లో మ్యాచ్ ఫీజులో భారీ కోత

అదే మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసినప్పుడూ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ ప్రవర్తనకు అప్పట్లో మ్యాచ్ ఫీజులో భారీ కోతను ఎదుర్కొన్నాడు.

మరో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను ఔటైన తర్వాత డగౌట్‌కు వెళ్లాలంటూ సైగలు చేశాడు.

తాజాగా ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్‌లోనూ తొలుత పాక్ బ్యాటర్ పట్ల ఇదే తరహాలో వ్యవహరించాడు.

అయితే ఆ తర్వాత ఆ బ్యాటర్ ఔటైనప్పుడు పాక్ ఆటగాడు మరింత దూకుడుగా స్పందించాడు. ఆ సమయంలో హర్షిత్ మాత్రం సంయమనం పాటించడం గమనార్హం.

ADVERTISEMENT

వివరాలు

అతడి దూకుడు కారణంగా గతంలో ఎదురైన కొన్ని పరిణామాలు ఇవే..

ఐపీఎల్‌లో ఒకసారి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా ఎదుర్కొన్నాడు. ఒకే సీజన్‌లో రెండోసారి నిబంధన ఉల్లంఘించడంతో ఒక మ్యాచ్ నిషేధం కూడా పడింది.

గతేడాది దిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ ప్రత్యర్థి బ్యాటర్‌ను ఔట్ చేసిన తర్వాత సైగలు చేస్తూ వార్తల్లో నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఇదే తరహా ప్రవర్తన కొనసాగింది. 2025 నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేసిన తర్వాత ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. దీంతో ఐసీసీ అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.

వివరాలు

దూకుడు తగ్గించుకుంటేనే..

ఎంతటి ప్రతిభ, నైపుణ్యం ఉన్నా.. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

హర్షిత్‌కు వేగంగా బౌలింగ్ చేయగల సామర్థ్యంతోపాటు, జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ పరుగులు సాధించే నైపుణ్యం ఉంది.

ఇవి అతడికి సానుకూల అంశాలు. గాయాల బారిన పడకుండా తన కెరీర్‌ను సరిగ్గా నిర్మించుకుంటే టీమ్‌ఇండియాలో పేస్ ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

అయితే మైదానంలో దూకుడు, ప్రత్యర్థులతో వాగ్వాదాలు, క్రమశిక్షణ ఉల్లంఘనలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతిభను నిలబెట్టుకుంటూనే ప్రవర్తనలోనూ మార్పు తెచ్చుకుంటేనే హర్షిత్ తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లగలడని చెబుతున్నారు.

ADVERTISEMENT