LOADING...
BCCI: భారత్-పాక్ మ్యాచులు నిలిపివేయడం సులభమేనా?.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

BCCI: భారత్-పాక్ మ్యాచులు నిలిపివేయడం సులభమేనా?.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లను నిలిపివేయాలన్న డిమాండ్లపై బీసీసీఐ అధికారి స్పందించారు. ఈ అంశంపై మాట్లాడటం తేలికే కానీ, ఆచరణలో అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ల ప్రయోజనాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకు ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లను తగ్గించాలని, ఇందుకోసం పారదర్శక డ్రా పద్ధతిని అనుసరించాలని అథర్టన్ సూచించారు. క్రికెట్ ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారానికి వేదికగా మారింది.

 Details

మాట్లాడడం తేలికే.. ఆచరణ కష్టం

కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం టోర్నీల షెడ్యూల్ మార్చడం సరికాదని ఆయన తన కాలమ్‌లో పేర్కొన్నారు. అథర్టన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, పేరు వెల్లడించని బీసీసీఐ అధికారి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం చాలా సులభం. కానీ స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు దీనిని అంగీకరిస్తారా? కేవలం భారత్ మాత్రమే కాదు, ఏ పెద్ద జట్టు టోర్నీ నుంచి తప్పుకున్నా స్పాన్సర్లను ఆకర్షించడం చాలా కష్టం అవుతుందని వ్యాఖ్యానించారు. గత నెల 28న ముగిసిన ఆసియా కప్ ఫైనల్ అనంతరం భారత్-పాక్ మ్యాచ్‌ల వివాదం మళ్లీ చెలరేగింది.

Details

ట్రోఫీని నిరాకరించిన భారత్

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించడం పెద్ద చర్చకు దారితీసింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం కూడా వివాదాస్పదమైంది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి బహుళ జాతీయ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. 2013 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదన్న విషయం తెలిసిందే.