Ravichandran Ashwin: ఇషాన్ కిషన్ పునరాగమనం.. ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్ : అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్‌ను ఇషాన్ కిషన్ ఎంత గౌరవించాడో, అదే క్రికెట్ అతడికి బహుమతిగా తిరిగి ఇచ్చిందని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో ఇషాన్ కిషన్ పునరాగమనాన్ని విశ్లేషించిన అశ్విన్, అతడి ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇది ఇషాన్ కిషన్‌కు క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్. బయటనుంచి చాలా మంది రకరకాలుగా ఊహించుకుంటారు. కొందరైతే ఇది అన్యాయమని కూడా చెప్పొచ్చు. కానీ జీవితం తిరిగి అదే స్థితికి తీసుకొచ్చింది. అతడు జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ, తిరిగి జట్టులోకి రావడానికి కూడా ఒకే ఒక కారణం ఉంది. అతడు క్రికెట్‌కు ఇవ్వాల్సినంత గౌరవాన్ని ఇచ్చాడని అశ్విన్ చెప్పాడు.
Details
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో తన నిబద్ధతను చాటుకున్నాడని అశ్విన్ వివరించాడు. బుచ్చిబాబు ట్రోఫీలో పాల్గొని చెన్నైకి వచ్చి ఝార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించాడని, రంజీ ట్రోఫీకి సంబంధించిన సన్నాహకాల్లో ఆ జట్టులో నంబర్‌వన్ ఆటగాడిగా నిలిచాడని వెల్లడించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించి తన సామర్థ్యాన్ని నిరూపించాడని పేర్కొన్నాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఇషాన్ అద్భుతంగా రాణించి, జట్టును విజయపథంలో నడిపించాడని అశ్విన్ గుర్తు చేశాడు.
Details
ఇషాన్ కిషన్ గొప్ప ఆటగాడు
ఆ టోర్నమెంట్‌లో అతడి ఆట అసాధారణమని, శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ ఆటను గౌరవించి విజయాన్ని అందుకున్నాడని ప్రశంసించాడు. నువ్వు పెద్ద ఆటగాడివా, చిన్న ఆటగాడివా, లేక కొత్తగా జట్టులోకి వచ్చావా అన్నది ముఖ్యం కాదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణిస్తే, మా కళ్లు ఎప్పుడూ మీపైనే ఉంటాయనే స్పష్టమైన సందేశాన్ని సెలక్టర్లు ప్లేయర్లకు పంపారు. వన్డేల్లో ఇషాన్ కిషన్ సాధించిన డబుల్ సెంచరీ అతడెంత గొప్ప ఆటగాడో చెప్పకనే చెబుతోంది'' అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.