
Ishan Kishan: దులీప్ ట్రోఫీ నుంచి వైదొలిగిన ఇషాన్.. ఆసియా కప్ జట్టులో చోటు దక్కేనా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆటగాళ్లు ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అత్యంత కీలకం. ఇక దేశవాళీ దులీప్ ట్రోఫీ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతుండగా, వచ్చే నెలలో ఆసియా కప్ జరగనుంది. ఈ సమయంలో గాయాల కారణంగా ఆటకు దూరమైతే, జట్టులో అవకాశాలు పొందడం మరింత కష్టమవుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు టీమ్‌ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు ఎదురైంది. దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగాలని భావించిన ఇషాన్, గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. అతని స్థానంలో ఆషిర్వాద్ స్వైయిన్‌ను ఎంపిక చేశారు.
Details
అభిమన్యు ఈశ్వరన్ కు బాధ్యతలు అప్పగింత
ఇషాన్ నాయకత్వంలో ఈస్ట్‌జోన్ బరిలో దిగాల్సి ఉండగా, ఇప్పుడు అతని గైర్హాజరీలో వైస్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇషాన్ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఒడిశా బోర్డు వెల్లడించలేదు. ఇక ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధమైంది. రిషబ్ పంత్ గాయం కారణంగా ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిస్థితిలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ మాత్రమే వికెట్ కీపర్-బ్యాటర్ స్థానానికి పోటీలో ఉన్నారు. ఎడమచేతివాటం బ్యాటర్ కావడం ఇషాన్‌కు ఒక అదనపు ప్లస్‌గా నిలిచినా, తాజాగా గాయం కారణంగా ఆసియా కప్‌లో అతని ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
Details
చివరిసారిగా 2023లో ఆడిన ఇషాన్ కిషన్
ఇషాన్ చివరిసారి జాతీయ జట్టుకు 2023లో ఆడాడు. అంతకు ముందు బీసీసీఐతో విభేదాల కారణంగా చాన్నాళ్లు దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కూ దూరమయ్యాడు. ఆ సమయంలో కౌంటీ క్రికెట్‌లో ఆడి తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. 2025 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక శతకం కూడా నమోదు చేశాడు. ఆ తర్వాత బీసీసీఐతో సయోధ్య కుదిరి మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాడు. దీంతో మళ్లీ జాతీయ జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. కానీ, తాజా గాయం కారణంగా దులీప్ ట్రోఫీకి దూరమవ్వడం, అతడి భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.