 
                                                                                Sunil Gavaskar: భారత్ వరల్డ్ కప్ గెలిస్తే జెమీమాతో కలిసి పాట పాడుతా: ఫ్యాన్స్‌కు గావస్కర్ ప్రామిస్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కి టీమ్‌ఇండియా అద్భుతంగా దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన భారత్ ఇప్పుడు తుది పోరుకు అర్హత సాధించింది. రాబోయే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్‌లో భారత్ టైటిల్ కోసం బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన హామీ ఇచ్చారు. సెమీస్‌లో అజేయ శతకంతో మెరిసిన జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి పాట పాడతానని తెలిపారు. అయితే, జెమీమా అందుకు అంగీకరిస్తేనేనని స్పష్టంచేశాడు. గతంలో భారత పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు మైదానంలోనే గావస్కర్ చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
వివరాలు
2024లో గిటార్ వాయించిన జెమీమా రోడ్రిగ్స్
"భారత్ వన్డే ప్రపంచకప్ గెలిస్తే, నేను జెమీమాతో కలిసి ఒక పాట పాడుతా.ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. ఆమె గిటార్ వాయిస్తే నేను నా గాత్రంతో జతకడతా.కొన్నాళ్ల క్రితం బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో మేమిద్దరం పాల్గొన్నాం. ఆ సమయంలో బ్యాండ్ ప్లే అవుతుండగా జెమీమా గిటార్ వాయించింది,నేను పాట పాడా.ఇప్పుడు అభిమానులకు హామీ ఇస్తున్నా.. మన జట్టు వరల్డ్‌కప్ గెలిస్తే మళ్లీ ఆ ప్రదర్శనను రిపీట్ చేస్తాం. కానీ ఈ ఓల్డ్‌మ్యాన్‌తో జెమీమా మళ్లీ స్టేజ్ షేర్ చేయాలనుకుంటేనే!"అని గావస్కర్ నవ్వుతూ అన్నారు. 2024లో బీసీసీఐ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో జెమీమా రోడ్రిగ్స్ గిటార్ వాయించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అదే వేదికపై సునీల్ గావస్కర్ తన గాన ప్రతిభతో క్రికెటర్లను అలరించారు.