LOADING...
Jasprit Bumrah: బుమ్రా ఉంటే మ్యాచ్ భారత్‌దే..
బుమ్రా ఉంటే మ్యాచ్ భారత్‌దే..

Jasprit Bumrah: బుమ్రా ఉంటే మ్యాచ్ భారత్‌దే..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అతడంటే నమ్మకం... అతడుంటే ధైర్యం... అతడే టీమ్‌కు రక్షణ. ఒత్తిడి ఎంత ఎక్కువైనా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా జట్టు ఆశలు మాత్రం నిరాశపరచడు. జారిపోతుందని అనిపించే మ్యాచ్‌లను కూడా అద్భుతమైన బౌలింగ్‌తో తిరిగి భారత్‌వైపు తిప్పేస్తాడు. అందుకే జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేకం. తన అసాధారణ ప్రతిభను మరోసారి నిరూపించుకున్న అతడు, ఈసారి టీ20 ప్రపంచకప్ వేదికగా తన హీరోచిత ప్రదర్శనతో అందరినీ మెప్పించాడు.

వివరాలు 

వాంఖడేలో బుమ్రా మ్యాజిక్

ముంబైలోని వాంఖడే స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. అక్కడ వేలాది మంది అభిమానులు మ్యాచ్‌ను ఉత్కంఠగా వీక్షిస్తుండగా, కోట్లాది మంది భారతీయులు టీవీల ముందు కళ్లప్పగించి కూర్చున్నారు. భారత్ 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న ఆందోళన కనిపించింది. కారణం ఇంగ్లాండ్ బ్యాటర్ బెతెల్ వీరవిహారం. 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 185/5. అప్పటికే బెతెల్ కేవలం 36 బంతుల్లోనే 81 పరుగులు చేసి భారత్ బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. చివరి ఐదు ఓవర్లలో 69 పరుగులు చేయడం వారికి పెద్ద పని కాకపోవచ్చన్న భావన నెలకొంది.

వివరాలు 

భారత జట్టుకు బ్రహ్మాస్త్రంలాంటి బుమ్రా

అలాంటి సమయంలో రంగంలోకి దిగాడు భారత జట్టుకు బ్రహ్మాస్త్రంలాంటి బుమ్రా. స్లో బంతులు, కచ్చితమైన యార్కర్లను సమర్థంగా వినియోగిస్తూ బ్యాటర్ల పరుగుల వేగాన్ని పూర్తిగా నియంత్రించాడు. 16వ ఓవర్లో కేవలం 8 పరుగులే ఇచ్చిన అతడు, 18వ ఓవర్లో అయితే ఆరు పరుగులకే పరిమితం చేశాడు. ఆ రెండు ఓవర్లే మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన కీలక ఘట్టాలయ్యాయి. టీమ్ ఇండియాను ఫైనల్‌కు చేర్చిన ఓవర్లు అవే అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తం మ్యాచ్‌లో రన్‌రేట్ 12.5కు చేరినా, బుమ్రా ఎకానమీ మాత్రం సుమారు 8.5 మాత్రమే ఉండటం అతడి బౌలింగ్ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

Advertisement

వివరాలు 

ఒత్తిడిలో మరింత ప్రమాదకరం 

బుమ్రా ఎంత ఏకాగ్రతతో, ఎంత కచ్చితత్వంతో బౌలింగ్ చేశాడంటే బ్యాటర్లకు అతడిని ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. మ్యాచ్‌లో ఒత్తిడి పెరిగే కొద్దీ అతడి ఆలోచన మరింత చురుకుగా మారుతుంది. అదే సమయంలో అతడి బంతుల్లో ఖచ్చితత్వం కూడా పెరుగుతుంది.ఈ మ్యాచ్ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణ మాత్రమే. సూపర్‌-8లోనూ అద్భుత ప్రదర్శన వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌-8 పోరులోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. విండీస్ జట్టు 102/1తో దూసుకుపోతూ పరుగుల వరద పారిస్తున్న సమయంలో మ్యాచ్ భారత్ చేతుల్లో నుంచి జారిపోతుందనిపించింది. అలాంటి దశలో 12వ ఓవర్లో ప్రమాదకర బ్యాటర్లు హెట్‌మయర్, చేజ్‌లను వరుసగా ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించాడు. అదే మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది.

Advertisement

వివరాలు 

గ్రూప్ దశలోనూ అదే ఆధిపత్యం

ఆ మ్యాచ్‌లో భారత్ పేలవమైన బ్యాటింగ్ కారణంగా ఓడిపోయినా, బుమ్రా బౌలింగ్ మాత్రం అద్భుతంగా నిలిచింది. అలాగే దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి తన సామర్థ్యాన్ని మరోసారి చాటాడు. గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి కూడా బుమ్రా కీలక కారణం. మ్యాచ్ రెండో ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ఆ జట్టు బ్యాటింగ్ క్రమాన్ని పూర్తిగా కుదేలు చేశాడు. ఆ దెబ్బతో పాకిస్థాన్ జట్టు పతనాన్ని అతడే ప్రారంభించాడు. నమీబియాపై 1/20, జింబాబ్వేపై 1/17 గణాంకాలతో బుమ్రా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

వివరాలు 

ఫైనల్లోనూ అదే మెరుపు

ఈ టోర్నీలో సిక్సర్లు,ఫోర్లు వర్షంలా కురిసినా కూడా అతడి ఎకానమీ కేవలం 6.21మాత్రమే ఉండటం విశేషం. బుమ్రా ఓవర్లు మిగిలి ఉన్నంత వరకు మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉందన్న నమ్మకం అభిమానుల్లో కనిపించింది. టోర్నీ అంతా అద్భుత ప్రదర్శనతో భారత్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించిన బుమ్రా, ఫైనల్లోనూ అంచనాలకు తగ్గట్టే రాణించాడు. కీలక సమయంలో చక్కని స్పెల్ వేసి మ్యాచ్‌కు అద్భుతమైన ముగింపు ఇచ్చాడు. రెండేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఆశలు దాదాపు ముగిసిపోయిన పరిస్థితిలో దక్షిణాఫ్రికా చేతుల్లో నుంచి బుమ్రా ట్రోఫీని లాగేసిన విధానం ఇప్పటికీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అందుకే క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చెప్పినట్టే-బుమ్రా నిజంగా "శతాబ్దానికి ఒక్కడు" అని చెప్పక తప్పదు.

Advertisement