John Cena: డబ్ల్యూడబ్ల్యూఈకి జాన్ సీనా గుడ్‌బై.. చివరి మ్యాచ్‌ను ఓటమితో ముగించిన లెజెండ్
ఈ వార్తాకథనం ఏంటి
రెజ్లింగ్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన దిగ్గజం జాన్ సీనా తన డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన 'సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్'తో డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే తన చివరి మ్యాచ్‌లో 'రింగ్ జనరల్' గంథర్ చేతిలో ఓటమి పాలవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలోనే అత్యంత ఐకానిక్ కెరీర్‌లలో ఒకటిగా నిలిచిన జాన్ సీనా, మొత్తం 17 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి అరుదైన ఘనత సాధించాడు. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికిన ఈ మ్యాచ్‌లో గంథర్‌తో జరిగిన పోరులో సీనా ట్యాప్ ఔట్ చేయాల్సి వచ్చింది.
Details
ప్రేక్షకుల నుంచి గంథర్ కు నిరసన
ఆశ్చర్యకరంగా తన కెరీర్‌లో ఒక మ్యాచ్‌లో ట్యాప్ ఔట్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ అరేనాలో జరిగిన ఈ ఫలితం అక్కడి ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. మ్యాచ్‌కు ముందుగా గంథర్ రింగ్‌లోకి అడుగుపెట్టగానే ప్రేక్షకుల నుంచి నిరసన వ్యక్తమైంది. అనంతరం జాన్ సీనా ఐకానిక్ థీమ్ సాంగ్ వినిపించగానే అరేనా మొత్తం ఉత్సాహంతో మారుమోగింది. రింగ్ పక్కన సీనాకు అతడి పాత ప్రత్యర్థులు స్వాగతం పలికారు. ప్రారంభం నుంచే గంథర్ ఆధిపత్యం కొనసాగించాడు. సీనా తన ట్రేడ్‌మార్క్ మూవ్స్ అయిన 'ఫైవ్-నకిల్ షఫుల్', 'ఎస్టీఎఫ్'తో గంథర్‌ను ఓడించేందుకు ప్రయత్నించాడు.
Details
గంథర్ చేతిలో ఓటమి
కానీ గంథర్ మళ్లీ మ్యాచ్‌పై పట్టుబిగించాడు. 43 ఏళ్ల వయసులోనూ సీనా 'సూపర్ సీనా' మోడ్‌లోకి వెళ్లి మరోసారి 'ఫైవ్-నకిల్ షఫుల్', 'ఏఏ' తో పోరాడాడు. అయితే గంథర్ రెండు కౌంట్ల వద్ద కిక్ అవుట్ చేసి సీనాను నిలువరించాడు. చివరికి సీనాను రింగ్ చుట్టూ విసిరి, స్టీల్ స్టెప్స్‌పై పడేసి ఆధిపత్యాన్ని నిరూపించాడు. ప్రేక్షకులు "యు స్టిల్ గాట్ ఇట్" అంటూ నినాదాలు చేసినా, గంథర్ ఒత్తిడికి సీనా ట్యాప్ ఔట్ చేయక తప్పలేదు. చివరి మ్యాచ్ అనంతరం సీనా రింగ్‌లోకి వచ్చి, ఇన్నేళ్లుగా తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకు అభివాదం చేసిన అనంతరం, తన షూస్, ఆర్మ్‌బ్యాండ్‌ను రింగ్‌లో ఉంచి చివరిసారిగా రింగ్‌ను విడిచిపెట్టాడు.
Details
సీనాను భుజాలపై ఉంచి గౌరవం
ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ భావోద్వేగంతో బ్యాక్‌స్టేజ్‌కు వెళ్లిపోయాడు. సీనా వీడ్కోలు మ్యాచ్ ముగిసిన తర్వాత, మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ రోస్టర్ అతడిని అభినందించేందుకు రింగ్‌లోకి వచ్చింది. కోడి రోడ్స్, సీఎం పంక్ తమ ఛాంపియన్‌షిప్ బెల్ట్స్‌ను సీనా భుజాలపై ఉంచి గౌరవం అందించారు. తన కెరీర్‌లో జాన్ సీనా 17 సార్లు వరల్డ్ ఛాంపియన్, 5 సార్లు యూఎస్ ఛాంపియన్, 4 సార్లు ట్యాగ్ టీమ్ ఛాంపియన్, 2 సార్లు రాయల్ రంబుల్ విజేత, ఒకసారి ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉండగా, అండర్‌టేకర్ కూడా 'ఎక్స్' వేదికగా జాన్ సీనాకు ప్రత్యేక ట్రిబ్యూట్ ఇచ్చాడు.
Details
నైస్ జాబ్ అంటూ అండర్‌టేకర్ ప్రశంస
2002లో స్మాక్‌డౌన్‌లో కర్ట్ యాంగిల్‌తో జరిగిన సీనా మెయిన్ రోస్టర్ అరంగేట్రాన్ని గుర్తు చేసుకుంటూ, అతడిని హస్టిల్, లాయల్టీ, రెస్పెక్ట్‌కు ప్రతీకగా అభివర్ణించాడు. 23 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలే ఇవాళ కూడా చెబుతున్నాను... నైస్ జాబ్," అంటూ అండర్‌టేకర్ సీనాను ప్రశంసించాడు. జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో సృష్టించిన చరిత్ర, అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.