Loading...
India Thrash Pakistan: జూనియర్ ఆసియా కప్‌లో పాక్ చిత్తు.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
జూనియర్ ఆసియా కప్‌లో పాక్ చిత్తు.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్

India Thrash Pakistan: జూనియర్ ఆసియా కప్‌లో పాక్ చిత్తు.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్‌ మహిళల హాకీ ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్‌ను ఏకంగా 19-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత యువ ప్లేయర్ల ధాటికి పాక్‌ జట్టు పూర్తిగా తేలిపోయింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరి వరకు భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. గ్రూప్‌ దశలోనూ జోరు.. గ్రూప్‌ దశలో భారత్‌ అద్భుత ప్రదర్శన చేసింది. జపాన్‌, మలేషియా, దక్షిణ కొరియాలపై విజయాలు సాధించింది. చైనాతో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. దీంతో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. అక్కడ పాకిస్థాన్‌తో తలపడింది. కీలక మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ భారీ విజయాన్ని నమోదు చేసింది.

వివరాలు 

తొలి అర్ధభాగంలోనే 10 గోల్స్‌..

పాకిస్థాన్‌పై భారత యువ ప్లేయర్‌ పూజ ఏడో నిమిషంలోనే గోల్‌ చేసి ఖాతా తెరిచింది.

ఆ తర్వాత సానికా మనె వరుసగా రెండు గోల్స్‌ సాధించి భారత్‌కు మరింత ఆధిక్యాన్ని అందించింది.

భారత దాడులను అడ్డుకోవడంలో పాక్‌ డిఫెన్స్‌ పూర్తిగా విఫలమైంది.

తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ 10-0తో భారీ ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలోనూ అదే హవా..

విరామం తర్వాత కూడా టీమ్‌ఇండియా దూకుడు తగ్గలేదు. మాలిక్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో భారత్‌ ఆధిపత్యం మరింత పెరిగింది.

మరోవైపు పాకిస్థాన్‌ నుంచి కనీస ప్రతిఘటన కూడా కనిపించలేదు.

భారత గోల్‌పోస్టు వైపు ఒక్కసారి కూడా పాక్‌ దాడి చేయలేకపోయింది. చివరకు భారత్‌ 19-0తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

వివరాలు 

హ్యాట్రిక్‌ టైటిల్‌పై గురి..

జూనియర్‌ మహిళల ఆసియా కప్‌లో భారత్‌ ఇప్పటికే 2023, 2024 సీజన్లలో విజేతగా నిలిచింది.

ఇప్పుడు వరుసగా మూడోసారి టైటిల్‌ను గెలుచుకోవడమే లక్ష్యంగా భారత జట్టు ముందుకు సాగుతోంది.

సెమీఫైనల్లో దక్షిణ కొరియా-మలేషియా క్వార్టర్‌ఫైనల్‌ పోరులో విజేతగా నిలిచే జట్టుతో భారత్‌ తలపడనుంది.

ADVERTISEMENT