LOADING...
IND vs PAK Final: కేవలం 11 పరుగులు చాలు.. రోహిత్-కోహ్లీ-రిజ్వాన్‌ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ!
కేవలం 11 పరుగులు చాలు.. రోహిత్-కోహ్లీ-రిజ్వాన్‌ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ!

IND vs PAK Final: కేవలం 11 పరుగులు చాలు.. రోహిత్-కోహ్లీ-రిజ్వాన్‌ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌తో పాటు యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కూడా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది. టీ20I క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్ల రికార్డులను అధిగమించే అంచున ఆయన నిలిచాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆస్ట్రేలియన్ స్టార్ ట్రావిస్ హెడ్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు ఆడిన అభిషేక్‌పై ఆసియా కప్‌కు ముందే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ టోర్నమెంట్‌లో ఆయన రాణిస్తున్నారు.

Details

అత్యుత్తమ స్కోరు 75

ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 51.50 సగటుతో, 204.63 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేసి టాప్ రన్-గేటర్‌గా నిలిచాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ ఫోర్ దశలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 75. ప్రస్తుతం ఒక మల్టీ-నేషన్ టీ20I టోర్నమెంట్‌లో భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి అభిషేక్ కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు 2014 టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఆ టోర్నమెంట్‌లో కోహ్లీ 6 ఇన్నింగ్స్‌లలో 106.33 సగటుతో, నాలుగు హాఫ్ సెంచరీలతో 319 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.

Details

అత్యధిక పరుగులు చేసే అవకాశం

అలాగే టెస్ట్ ఆడే దేశం నుండి ఏదైనా టీ20I సిరీస్ లేదా టోర్నమెంట్‌లో ఒక బ్యాటర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ 'ఫిల్ సాల్ట్' రికార్డును బద్దలు కొట్టడానికి కూడా అభిషేక్ కేవలం 23 పరుగుల దూరంలో ఉన్నాడు. 2023లో వెస్టిండీస్ పర్యటనలో సాల్ట్ 5 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 119 అత్యుత్తమ స్కోరు నమోదు చేసి, 82.75 సగటుతో, 185.95 స్ట్రైక్ రేట్‌తో 331 పరుగులు సాధించాడు. ఇక వరుసగా 30+ స్కోర్ల విభాగంలో కూడా అభిషేక్ ప్రత్యేక రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు. ఇప్పటివరకు 7 సార్లు 30కి పైగా స్కోరు చేశాడు. దీంతో రోహిత్ శర్మ (నవంబర్ 2021-ఫిబ్రవరి 2022), మహ్మద్ రిజ్వాన్(ఏప్రిల్-అక్టోబర్ 2021)లతో సమానంగా నిలిచాడు.

Details

అగ్రస్థానంలో నిలిచే అవకాశం

మరోసారి 30కి పైగా స్కోరు చేస్తే వారిని అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ ఏడాది ఆయన ప్రదర్శన మరింత దూకుడుగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 11 టీ20I మ్యాచ్‌ల్లో 53.45 సగటుతో, 211.51 స్ట్రైక్ రేట్‌తో 588 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం కెరీర్ గణాంకాలు చూసినా ఆయన ప్రతిభ స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు ఆడిన 23 టీ20I మ్యాచ్‌లలో 22 ఇన్నింగ్స్‌లలో 844 పరుగులు చేశాడు. ఆయన సగటు 38.36, స్ట్రైక్ రేట్ 197.65. ఇందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 135.