Rajasthan Royals: ఐపీఎల్‌లో భారీ డీల్.. రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాని ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో ప్రముఖ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని 100 శాతం సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లుగా ( భారత కరెన్సీలో రూ.13,500 కోట్లు) నిర్ణయించబడినట్లు సమాచారం. చర్చల తర్వాత దీనికి సంబంధించిన ఒప్పందం పూర్తయ్యింది. గత ఆరు నెలలుగా రాజస్థాన్ రాయల్స్ కొనుగోలుపై కాల్ సోమాని యాజమాన్యం చర్చలు జరుపుతోంది. చివరకు కాల్ సోమాని నేతృత్వంలోని బృందం విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టును తమ సొంతం చేసుకుంది.
వివరాలు
ఇంతకీ ఈ కాల్ సోమాని అంటే ఎవరు?
కాల్ సోమాని టెక్నాలజీ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఎడ్యుకేషన్ టెక్నాలజీ, డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఆయన సంస్థలు పనిచేస్తున్నాయి. ఇన్‌ట్రాఎడ్జ్, ట్రూయో, ట్రూయో ఏఐ, అకాడెమియన్ వంటి గ్లోబల్ కంపెనీలను స్థాపించారు. ఈ కన్సార్టియానికి అమెరికన్ వ్యాపారవేత్త రాబ్ వాల్టన్ మద్దతు ఇస్తున్నారు. వాల్మార్ట్ కుటుంబానికి చెందిన ఆయనతో పాటు, ఎన్ఎఫ్ఎల్ జట్టు డెట్రాయిట్ లయన్స్‌లో మెజారిటీ వాటాలు కలిగిన హాంప్ కుటుంబం కూడా ఈ పెట్టుబడిలో భాగమైంది. ఫోర్డ్ మోటార్ కంపెనీలో వాటాలు ఉన్న షీలా ఫోర్డ్ హాంప్ కూడా ఈ బృందంలో ఉన్నారు.
వివరాలు
రాజస్థాన్ రాయల్స్‌కు మంచి రోజులు..
కాల్ సోమాని క్రీడారంగంలో కూడా తన ముద్ర వేశారు. మోటర్ సిటీ గోల్ఫ్ క్లబ్‌కు సహ యజమానిగా ఉన్న ఆయన, టెక్ ఆధారిత క్రీడా సంస్థలైన టీఎంఆర్‌డబ్ల్యూ స్పోర్ట్స్, టీజీఎల్ గోల్ఫ్ లీగ్‌లలో ప్రారంభ దశలోనే పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టిన సమయంలో ఐపీఎల్ భవిష్యత్తుపై విశ్వాసం ఉందని సోమాని పేర్కొన్నారు. ఈ కొత్త యాజమాన్యంతో జట్టు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.