The Ashes 2025-26: పిచ్ వివాదంపై కెవిన్ పీటర్సన్ ఫైర్.. ఆస్ట్రేలియాపై ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గెలుచుకుని సిరీస్‌ను ఖాయం చేసుకుంది. ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి రోజే సంచలనంగా మారింది. ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన ఇంగ్లాండ్ కూడా ఆసీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 29.5 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది.
Details
20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి
బాక్సింగ్ డే టెస్ట్ చరిత్రలో తొలి రోజే 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి కావడం విశేషం. గతంలో 1998లో జరిగిన యాషెస్ టెస్ట్‌లో తొలి రోజు 18 వికెట్లు మాత్రమే పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు మాత్రం 1888లో లార్డ్స్‌లో జరిగిన యాషెస్ టెస్ట్‌కు చెందింది. ఆ మ్యాచ్‌లో తొలి రోజే బౌలర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. అలాగే 1902 తర్వాత మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనే తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే కావడం గమనార్హం. ఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ 'ఎక్స్' వేదికగా స్పందించాడు.
Details
అదే పరిస్థితి ఆస్ట్రేలియాలోనే ఉంది
'స్వదేశంలో టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తొలి రోజే ఎక్కువ వికెట్లు పడితే అంతా భారత్‌ను నిందిస్తారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఆస్ట్రేలియాలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో పారదర్శకత పాటించాలి' అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పలువురు క్రికెట్ అభిమానులు కెవిన్ పీటర్సన్‌కు మద్దతుగా స్పందిస్తున్నారు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు తొలి రోజే రికార్డు స్థాయిలో 94,199 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రికెట్ మైదానమైన ఎంసీజీలో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. అయితే మ్యాచ్ అంతా బౌలర్లే ఆధిపత్యం చెలాయించడంతో, బ్యాటింగ్ విన్యాసాలు చూడాలని వచ్చిన పలువురు అభిమానులు నిరాశ చెందారు.