మరోసారి ధోనీని ట్రోల్ చేసిన కెవిన్ పీటర్సన్.. స్పందించని మిస్టర్ కూల్
ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మరోసారి ఎంఎస్ ధోనీని ట్రోల్ చేశాడు. సరదాగా మంగళ, బుధవారాల్లో వరుస ట్వీట్లతో ధోనీపై పీటర్సన్ కౌంటర్లు వేశాడు. ఒకప్పుడు వీరద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ధోని తీసిన తొలి టెస్ట్ వికెట్ తనది కాదంటూ ఈసారి వీడియోను పీటర్సన్ బయటపెట్టడం విశేషం. వాస్తవంగా ఈ ఇద్దరి మధ్య 2017 ఐపీఎల్ సందర్భంగా తొలిసారిగా సరదా ఫైట్ జరిగిన విషయం తెలిసిందే. పుణే సూపర్ జెయింట్స్ జట్టు తరుపున ధోని ఆడుతున్నాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న మనోజ్ తివారీతో.. ధోని కంటే తాను మంచి గోల్ఫర్ అని పీటర్సన్ పేర్కొన్నారు.
ధోని ఔట్ చేయలేదు: పీటర్సన్
దీనిపై ధోని తనదైన స్ట్రైల్లో అప్పట్లో సమాధానం ఇచ్చాడు. తాను టెస్టుల్లో తీసిన తొలి వికెట్ నీదే అంటూ మైక్ ద్వారా పీటర్సన్ కి ధోని సమాధానమిచ్చాడు. అయితే ఆ రోజు డీఆర్ఎస్ తీసుకోవడంతో ఆంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు పీటర్సన్ గుర్తు చేశాడు. మే16న ఈ ఘటనపై వీడియో సాక్ష్యంతో మరోసారి పీటర్సన్ ట్విట్ చేశాడు. 2011లో ఇంగ్లండ్ టూర్ సందర్భంగా ఓమ్యాచ్ లో ధోని బౌలింగ్ చేయడంతో పీటర్సన్ వికెట్ కీపర్ ద్రవిడ్ కు క్యాచ్ ఇచ్చాడు. వెంటనే దీనిపై కేపీ రివ్యూ కోరవడంతో అసలు బంతి బ్యాట్ కు తగల్లేదని గుర్తించారు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే దీనిపై ధోని ఇంతవరకూ స్పందించలేదు.