
Kho Kho World Cup: మహిళల,పురుషుల భారత ఖోఖో ప్రపంచకప్‌లు మనవే..
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన కాసేపటికే, భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన తుదిపోరులో భారత్ 54-36 తేడాతో ఘన విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత పురుషుల జట్టు, అదే జోరును తుదిపోరులోనూ కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్‌ను పూర్తిగా కట్టడి చేసిన భారత్ విశ్వవిజేతగా అవతరించింది. మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ 2025లో భారత మహిళలు, పురుషుల జట్లు ఒకేసారి చాంపియన్స్‌గా నిలవడం ప్రత్యేక విశేషంగా నిలిచింది.
వివరాలు
తొలి ఖోఖో ప్రపంచకప్‌లో చాంపియన్స్‌గా..
ముందుగా జరిగిన మహిళల ఖోఖో వరల్డ్‌కప్ ఫైనల్లో, భారత మహిళల జట్టు ఖోఖో ప్రపంచకప్ (Kho Kho World Cup 2025) విజేతగా అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ప్రారంభం నుంచి అద్భుతంగా ప్రదర్శించిన భారత జట్టు, ఫైనల్‌లోనూ అదే సత్తాను చాటుకుని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్ జట్టును ఓడించి తొలి ఖోఖో ప్రపంచకప్‌లో చాంపియన్స్‌గా నిలిచింది.
వివరాలు
నేపాల్‌ను మట్టికరిపించి ఖోఖో ప్రపంచకప్ సొంతం చేసుకున్న భారత్
ఈ ఫైనల్లో టాస్ గెలిచిన నేపాల్,ముందుగా భారత్‌ను అటాక్ చేయమని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్‌కు ఒక వరంలా మారితే,ప్రత్యర్థి నేపాల్‌కు శాపంలా మారింది. ప్రారంభం నుంచి రెచ్చిపోయిన భారత జట్టు,ప్రత్యర్థి జట్టును వరుస విరామాల్లో తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆఖరి వరకు అదే ఆటతీరుతో సాగిన భారత జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి ఖోఖో ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.