kimi antonelli: ఏడేళ్లకే ట్రాక్‌పై అడుగు.. ఇప్పుడు ఎఫ్-1 విజేత
ఈ వార్తాకథనం ఏంటి
ఒకవైపు జార్జ్ రసెల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలవడం, మరోవైపు మాక్స్ వెర్‌స్టాపెన్, లూయిస్ హామిల్టన్, లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి వంటివారు పోటీలో ఉండటం - ఇలాంటి పరిస్థితుల్లో ఒక టీనేజర్ చైనీస్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఫార్ములా వన్ (ఎఫ్1) చరిత్రలో గ్రాండ్ ప్రి గెలిచిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆ యువ రేసర్ ఎవరో కాదు.. ఇటలీకి చెందిన 19 ఏళ్ల కిమి ఆంటోనెలి. తొలి విజయంతోనే ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
వివరాలు
చిన్న వయసులోనే ట్రాక్‌పై అడుగులు
కిమి ఆంటోనెలికి రేసింగ్ అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతని తండ్రి మార్కో ఆంటోనెలి కూడా ఒక రేసర్. 1990లలో ఇటలీ తరపున అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి మంచి డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఎఫ్-1 గ్రాండ్ ప్రి స్థాయి విజయాలు అందుకోకపోయినా రేసింగ్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు సంపాదించాడు. తన అనుభవాన్ని కొనసాగించేందుకు 1993లో ఆంటోనెలి మోటర్‌స్పోర్ట్ పేరుతో ఒక రేసింగ్ జట్టును స్థాపించాడు. కిమికి చిన్ననాటి నుంచే రేసింగ్‌పై ఆసక్తి పెరిగింది. కేవలం ఏడేళ్ల వయసులోనే ట్రాక్‌పై అడుగుపెట్టాడు. తండ్రి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతూ అతడు వేగంగా ఎదిగాడు. చిన్న వయసులోనే అతడి మెరుపు వేగం అందరినీ ఆకట్టుకుంది.
వివరాలు
ఫార్ములా వన్‌లో వేగవంతమైన ఎదుగుదల
గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి ద్వారా కిమి ఫార్ములా వన్‌లో అరంగేట్రం చేశాడు. ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్ ఫెరారీ జట్టుకు మారడంతో మెర్సిడెజ్ జట్టులో ఖాళీ అయిన స్థానంలో కిమిని ఎంపిక చేశారు. ఆ జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ యువ డ్రైవర్ నిలబెట్టాడు. 2025లో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిలో పోటీ పడిన మూడో పిన్న వయస్కుడిగా మరో ఘనతను అందుకున్నాడు. తాజాగా చైనీస్ గ్రాండ్ ప్రిలో అతడు మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.
వివరాలు
భవిష్యత్ సూపర్‌స్టారా?
గత రెండు దశాబ్దాలుగా ఫార్ములా వన్ గురించి మాట్లాడితే మైకేల్ షుమాకర్, లూయిస్ హామిల్టన్, ఫెర్నాండో అలెన్సో, మాక్స్ వెర్‌స్టాపెన్ వంటి డ్రైవర్లే ఎక్కువగా గుర్తొచ్చేవారు. వీరు ఒక సీజన్‌లో అనేక రేసుల్లో ఆధిపత్యం చాటేవారు. అయితే ప్రస్తుతం ఒక్కో రేసులో ఒక్కో డ్రైవర్ మెరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ధోరణిని మార్చే సామర్థ్యం కిమి ఆంటోనెలిలో కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఫార్ములా వన్‌లో అతడు క్రమంగా పైస్థాయిలకు ఎదుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం.