MS Dhoni: 2011 వరల్డ్‌కప్ ఫైనల్ సిక్స్‌పై నోరు విప్పిన కులశేఖర.. ధోనీ గురించి షాకింగ్ నిజాలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ చరిత్రలో 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ కోట్లాది భారత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆ చారిత్రాత్మక సిక్స్‌కు బౌలింగ్ చేసిన శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర తాజాగా ఆ ఫైనల్‌కు సంబంధించిన జ్ఞాపకాలను, అలాగే ధోనీ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత తాను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో చేరి ధోనీతో కలిసి ఆడినప్పటికీ, 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో కొట్టిన ఆ విన్నింగ్ సిక్స్ గురించి ధోనీ తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని కులశేఖర వెల్లడించాడు.
వివరాలు
ధోనీ గతాన్ని పట్టించుకోడు
ప్రపంచకప్ తర్వాత నేను సీఎస్‌కేలో చేరాను. ధోనీతో చాలా సమయం గడిపాను. కానీ, అతను ఎప్పుడూ ఆ ఫైనల్ గురించి ప్రస్తావించలేదు.
దీన్నిబట్టే అతను ఎలాంటి వ్యక్తో అర్థమవుతుంది. ఎంఎస్ ధోని ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన ఆటగాడు. అతను గతాన్ని పట్టించుకోడు. ఎప్పుడూ వర్తమానంపైనే దృష్టి పెడతాడు.
రాబోయే మ్యాచ్‌ను ఎలా గెలవాలన్నదే అతని ఆలోచన. అతనిలో నాకు అత్యంత నచ్చిన లక్షణం ఇదేనని కులశేఖర ప్రశంసించాడు.ధోనీ కొట్టిన ఆ చారిత్రాత్మక సిక్స్ గురించి స్పందిస్తూ కులశేఖర వాస్తవికంగా మాట్లాడాడు.
"క్రికెట్‌లో పవర్‌ప్లే అయినా, డెత్ ఓవర్లు అయినా ఏ బౌలర్‌కైనా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
వివరాలు
అద్భుతంగా ఆ బంతిని సిక్స్ గా మలిచాడు
ధోనీని ఔట్ చేయడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. కానీ అతను అద్భుతంగా సిక్స్ కొట్టాడు. అయితే 2014 టీ20 ప్రపంచకప్‌ను మేం కూడా ఇదే తరహాలో గెలుచుకోవడం నాకు సానుకూల జ్ఞాపకం. క్రికెట్ అందం కూడా ఇదేనని చెప్పాడు.
అదే సమయంలో 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో జరిగిన ఒక కీలక తప్పిదాన్ని గుర్తుచేసుకుంటూ కులశేఖర విచారం వ్యక్తం చేశాడు.
గౌతమ్ గంభీర్ 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు తన బౌలింగ్‌లో వచ్చిన సులభమైన క్యాచ్‌ను తాను జారవిడిచానని, అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని అన్నాడు.
ఆ తర్వాత గంభీర్ అద్భుతంగా ఆడి 97 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
వివరాలు
ఆ విషయంపై ఇప్పటికీ పశ్చాత్తాపం
ఒక దశలో మేమే మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం కలిగింది.
కానీ గంభీర్ క్యాచ్‌ను వదిలేయడం పెద్ద మలుపుగా మారింది. ఆ విషయంపై ఇప్పటికీ పశ్చాత్తాపం ఉంది.
అయితే ఇలాంటి తప్పిదాలు పెద్ద మ్యాచ్‌ల్లో సహజం. అలాగే, ఆ ఫైనల్‌లో మంచు (డ్యూ) ప్రభావం కూడా మా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటని నేను ఇప్పటికీ నమ్ముతున్నానని నువాన్ కులశేఖర పేర్కొన్నాడు.