Page Loader
Kuldeep Yadav: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన కుల్దీప్ యాదవ్ 
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన కుల్దీప్ యాదవ్

Kuldeep Yadav: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన కుల్దీప్ యాదవ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరిలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడిన తరువాత, భారత్ జట్టు ప్రఖ్యాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొననుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే, భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరుగుతాయి. ఇప్పటికే,బీసీసీఐ భారత్ జట్టులో 15 మంది ఆటగాళ్లను ప్రకటించింది. ఇందులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు.అయితే, అతని ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం, అతను ఫిట్నెస్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కుల్దీప్ యాదవ్ సర్జరీ చేయించుకున్నాడు, ఆ తరువాత జట్టుకు దూరమయ్యాడు. జనవరి 26న నేషనల్ క్రికెట్ అకాడమీలో అతనికి ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు,దానిని కుల్దీప్ విజయవంతంగా పూర్తి చేశాడు.

వివరాలు 

యూపీ తరపున కుల్దీప్

ఈ సందర్భంగా, అతను ఎక్స్ వేదికగా, ఫిట్నెస్ సాధించేందుకు చేసిన కృషి కోసం ఎన్సీఏ బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం, కుల్దీప్ రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టు తరపున ఆడుతున్నాడు. గురువారం నుంచి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. కుల్దీప్ ఈ మ్యాచ్‌లో యూపీ తరపున బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ సాధించటం భారత జట్టుకు గొప్ప శుభవార్త. ఫిబ్రవరి 6నుంచి ఇండియా,ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు.

వివరాలు 

ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ 

ఈ క్రమంలో, అతడు వన్డే మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరే అవకాశముంది. తద్వారా, భారత స్పిన్ బౌలింగ్ దాడి మరింత బలపడుతుంది. కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్‌తో ఉన్నప్పటికీ, రంజీ ట్రోఫీలో, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమవుతుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉంటాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా పోటీ పడనుంది. 2013లో ధోనీ నాయకత్వంలో టీమిండియా చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.