LOADING...
ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మెరిసిన క్రికెటర్లు.. తొలిసారి టాప్‌-10లో జెమీమా..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో మెరిసిన క్రికెటర్లు..తొలిసారి టాప్‌-10లో జెమీమా..!

ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మెరిసిన క్రికెటర్లు.. తొలిసారి టాప్‌-10లో జెమీమా..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
06:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనలతో మెరిసిన క్రికెటర్లు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటారు. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో అజేయ శతకం నమోదు చేసి భారత్ విజయానికి కంచుకోటగా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) తొలిసారి టాప్-10 బ్యాటర్ల జాబితాలోకి ఎగబాకింది. ఇక, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కి మాత్రం కొత్త షాక్ ఎదురైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Wolvaardt) తన అద్భుత ఫామ్‌తో మంధానను మొదటి స్థానంలోనుంచి కిందకు నెట్టేసింది. సఫారీలకు కప్ అందించడంలో విఫలమైనా, వ్యక్తిగతంగా లారా కెరీర్‌లోనే ఉత్తమ ర్యాంక్‌ను అందుకుంది. ఆమెకు 814 రేటింగ్ పాయింట్లు లభించాయి, దీంతో వన్డేల్లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

వివరాలు 

న్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో లారా

వరల్డ్ కప్ ప్రారంభం నుంచి అగ్రస్థానంలో ఉన్న మంధాన టోర్నీ ముగిసే సమయానికి ఒక ర్యాంక్ కోల్పోయింది. స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో ఒక శతకం,ఒక అర్ధశతకం బాదిన ఆమె టీమిండియాకు కీలక పరుగులు అందించి రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వరుసగా రెండు సెంచరీలు బాదిన లారా,తన అద్భుత బ్యాటింగ్‌తో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లోనూ ఆమె తన శక్తినంతా వినియోగించి 101 పరుగులతో పోరాడినా,జట్టును విజయం దిశగా తీసుకురాలేకపోయింది. అయినా, మొత్తం టోర్నీలో 571 పరుగులు బాదిన లారా టాప్ స్కోరర్‌గా నిలిచి మంధానను రెండో స్థానానికి నెట్టేసింది. ప్రస్తుతం మంధాన 811 రేటింగ్ పాయింట్లు సాధించింది. అలాగే టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ ఆమె రెండో స్థానంలో కొనసాగుతోంది.

వివరాలు 

జెమీమాకు కెరీర్ టర్నింగ్ పాయింట్ 

ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో సాధించిన అజేయ శతకం జెమీమా కెరీర్‌లో కీలక మలుపు తిప్పింది. పేసర్లతో నిండిన ఆసీస్ బౌలింగ్‌ను ఎదుర్కొని 127 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చిన ఆమె తొమ్మిది స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్-10లోకి చేరింది. భారత్‌పై సెమీఫైనల్లో సెంచరీతో మెరిసిన ఫోబీ లిచ్‌ఫీల్డ్ (Phoebe Litchfield) 13 స్థానాలు మెరుగుపడి 13వ ర్యాంక్‌ను అందుకుంది. అలాగే, టోర్నీలో మొత్తం 215 పరుగులు చేయడంతో పాటు 22 వికెట్లు దక్కించుకున్న భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికైంది. ఆమె ఆల్‌రౌండర్ల విభాగంలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహిళక్రికెటర్ల ఐసీసీ ర్యాంకింగ్స్‌