నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన
గౌహతి వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన సెంచరీని చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 73 సెంచరీలు చేసిన పరుగుల వీరుడు..ఈ క్రమంలో పలు రికార్డులను అధిగమించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత తన సెంచరీపై కోహ్లీ స్పందించాడు. తానేమీ భిన్నంగా ప్రయత్నించలేదని, అదనంగా 25-30 పరుగుల కోసం వేగంగా ఆడానని చెప్పారు. సెకాండాఫ్ లో పరిస్థితులను అర్థం చేసుకొని మంచి స్కోరును సాధించామన్నారు. తనకు తెలిసిందే ఒకటేనని, నిరాశగా ఉంటే ముందుకెళ్లలేమని, క్రీజులో భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలన్నారు. ఇదే తన చివరి గేమ్ అన్నట్లు గా ఆడానని కోహ్లీ వివరించారు.
కోహ్లీని సచిన్‌తో పోల్చడం సరికాదు : గంభీర్
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ వన్డేల్లో 45వ సెంచరీని పూర్తి చేశాడు. మరో ఐదు శతకాలు చేస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అయితే కోహ్లీ సెంచరీలపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సచిన్ టెండుల్కర్‌తో విరాట్ కోహ్లీని పోల్చడం సరైంది కాదని గంభీర్ చెప్పారు. సచిన్ ఆడినప్పుడు ఫీల్డింగ్ నిబంధనలు, ఇప్పుడున్న ఫీల్డింగ్ నిబంధనలు వేరన్నాడు. కొన్ని రూల్స్ మారడం ప్రస్తుత బ్యాటర్లకు అనుకూలంగా మారిందని. వన్డేలో సచిన్ కంటే కోహ్లీ ఎక్కువ సెంచరీలు చేస్తాడన్నారు. అయితే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, ఇందులో ఎలాంటి సందేహం లేదని గంభీర్ చెప్పుకొచ్చారు.