Washington: లింకన్ పోయి.. వాషింగ్టన్ వచ్చె.. ఇరాన్ యుద్ధంలో అమెరికా కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తున్న సుదీర్ఘ యుద్ధం అమెరికాకు సంక్లిష్ట పరిస్థితులను తెచ్చిపెడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విశ్వసనీయమైన సైనిక ఒత్తిడిని కొనసాగిస్తూనే.. పశ్చిమాసియాలోనూ సైనిక కార్యకలాపాలను పెంచడం అమెరికాకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా విమానవాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ ను వెనక్కి రప్పిస్తున్నారు. దాని స్థానంలో పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఉన్న యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్ ను పశ్చిమాసియాకు తరలించనున్నారు. దీంతో కొంతకాలం పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఏదీ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. చైనా ఈ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.
వివరాలు
240 రోజులకు పైగా సముద్రంలోనే..
యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ వాస్తవానికి నిర్ణయించిన గడువు కంటే ఎక్కువ కాలం పశ్చిమాసియాలో విధులు నిర్వర్తించింది.
ఈ విమానవాహక నౌక వరుసగా 240 రోజులకు పైగా సముద్రంలో ఉంది. దీంతో నౌక సిబ్బందిలో అలసట, మానసిక ఆరోగ్య సమస్యలు, అవసరమైన సామగ్రి, సరఫరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అబ్రహాం లింకన్ మే నెలలోనే అమెరికాకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైనిక చర్యలకు విమానవాహక నౌకలపై అమెరికా ఎక్కువగా ఆధారపడటంతో దాని మోహరింపును కొనసాగించారు.
వివరాలు
ఫోర్డ్ కూడా సుదీర్ఘ మోహరింపు తర్వాతే..
యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ కూడా సుదీర్ఘంగా 11 నెలలపాటు మోహరింపులో ఉన్న అనంతరం ఈ ఏడాది మేలో స్వదేశానికి చేరుకుంది.
అది సముద్రంలో విధులు నిర్వర్తించిన సమయంలో ఇరాన్‌పై సైనిక పోరాటంతోపాటు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించే ఆపరేషన్ వంటి చర్యలకు మద్దతు అందించింది.
అయితే ఆ విమానవాహక నౌకలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో మరమ్మతుల కోసం తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చింది.
దీంతో ఒకేసారి పలు ప్రాంతాల్లో సైనిక ఒత్తిడిని కొనసాగించాల్సిన అమెరికాకు విమానవాహక నౌకల మోహరింపు విషయంలో సవాళ్లు మరింత పెరిగాయి.