Lionel Messi: చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ.. ఇంటర్ మయామి తరఫున 100వ గోల్
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు. ఇంటర్ మయామి క్లబ్ తరఫున 100వ గోల్ నమోదు చేయడంతో పాటు, జట్టుకు మరో ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను అందించాడు. తాజాగా జరిగిన కాంపియోన్స్ కప్ ఫైనల్‌లో ఇంటర్ మయామి 2-0 తేడాతో క్రూజ్ అజుల్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేయడంతో పాటు మరో గోల్‌కు అసిస్ట్ అందించి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు.
వివరాలు
24వ నిమిషంలోనే మెస్సీ గోల్
మ్యాచ్ ప్రారంభమైన 24వ నిమిషంలో మెస్సీ తన సత్తా చాటాడు.
సహచర ఆటగాడు లూయిస్ సువారెజ్ అందించిన క్రాస్‌ను అద్భుతమైన డైవింగ్ హెడర్‌తో గోల్‌గా మలిచాడు.
ఈ గోల్‌తో ఇంటర్ మయామి తరఫున అతని గోల్స్ సంఖ్య 100కు చేరింది.
కేవలం 115 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్న మెస్సీ.. మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) చరిత్రలో ఒకే క్లబ్ తరఫున అత్యంత వేగంగా 100 గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇప్పటివరకు ఇంటర్ మయామి తరఫున మెస్సీ 100 గోల్స్‌తో పాటు 55 అసిస్ట్‌లు నమోదు చేశాడు.
వివస్ర్తాలు
మెస్సీ అసిస్ట్‌తో రెండో గోల్
మ్యాచ్ 81వ నిమిషంలో మెస్సీ మరోసారి జట్టు విజయానికి దోహదపడ్డాడు.
అతను అందించిన కార్నర్ కిక్‌ను కాసెమిరో హెడర్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో ఇంటర్ మయామి ఆధిక్యం 2-0కు పెరిగింది.
చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న మయామి ఘన విజయం సాధించింది.
వివరాలు
తొలిసారి కాంపియోన్స్ కప్ ముద్దాడిన మయామి
క్రూజ్ అజుల్‌పై గెలుపుతో ఇంటర్ మయామి తొలిసారి కాంపియోన్స్ కప్‌ను సొంతం చేసుకుంది.
అమెరికా మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) కప్ విజేత, మెక్సికో లిగా ఎంఎక్స్ విజేత మధ్య ఏటా ఈ టోర్నీ నిర్వహిస్తారు.
గత మూడు సీజన్లుగా మెక్సికన్ జట్లే ఈ కప్‌ను గెలుచుకుంటూ వచ్చాయి. అయితే, ఈసారి ఇంటర్ మయామి వారి ఆధిపత్యానికి తెరదించింది.
కొత్త హెడ్ కోచ్ క్రిస్టియన్ గొంజాలెజ్‌కు ఇది తొలి మ్యాచ్ కావడం మరో విశేషం. తొలి మ్యాచ్‌లోనే జట్టుకు ట్రోఫీ అందించడం ద్వారా అతను శుభారంభం చేశాడు.
వివరాలు
క్రూజ్ అజుల్‌పైనే తొలి గోల్
2023లో ఇంటర్ మయామిలో చేరిన లియోనెల్ మెస్సీ.. ఆ క్లబ్ తరఫున తన తొలి గోల్‌ను కూడా క్రూజ్ అజుల్‌పైనే నమోదు చేశాడు.
తాజాగా అదే జట్టుపై 100వ గోల్ సాధించడం విశేషంగా నిలిచింది. 39 ఏళ్ల వయసులోనూ మెస్సీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
అతను ఇంటర్ మయామిలో చేరిన తర్వాత జట్టు లీగ్స్ కప్, సపోర్టర్స్ షీల్డ్, ఎంఎల్ఎస్ కప్ వంటి పలు టైటిళ్లను సాధించింది.
ఇప్పుడు కాంపియోన్స్ కప్ కూడా మయామి ఖాతాలో చేరడంతో మెస్సీ నాయకత్వంలో క్లబ్ మరో ఘనతను అందుకుంది.