
ENG vs IND : లోయర్ ఆర్డర్ విఫలం.. టాప్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి : గిల్ కీలక సూచన
ఈ వార్తాకథనం ఏంటి
అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నేడు ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. తొలి టెస్టులో అనూహ్య ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లకు కీలక సూచనలు చేశారు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా ప్రదర్శన కనబర్చలేకపోయారు. దీంతో భారత జట్టు తక్కువ స్కోర్లకే పరిమితమైంది. ఈ అంశాన్ని గుర్తు చేసిన గిల్, టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ బాధ్యతతో ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
Deails
టాప్ ఆర్డర్లు రాణించాలి
ప్రత్యేకంగా బ్యాటింగ్ డెప్త్ లేకపోయిన తరుణాల్లో టాప్ ఆర్డర్ నుంచి పుష్కలంగా పరుగులు రావాలని ఆయన సూచించారు. తన వ్యక్తిగత ఆటతీరుపైనా గిల్ వ్యాఖ్యలు చేశారు. "నాకైతే సెంచరీ అనంతరం 147 వద్ద ఔటయ్యాను. కొద్దిగా జాగ్రత్తగా ఆడుంటే పంత్‌తో కలిసి మరో 50 పరుగుల భాగస్వామ్యం కుదిరేదన్న విశ్వాసం ఉందని గిల్ వెల్లడించారు. మంచి బంతికి ఔటైతే ఎటువంటి సమస్య లేదన్న గిల్, కానీ క్రీజులో పట్టు సాధించిన తర్వాత మాత్రం బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉందన్నారు.
Details
బుమ్రాపై స్పష్టత లేదు
రెండో టెస్టులో బుమ్రా ఆడతాడా? అనే ప్రశ్నపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. టీమ్ మేనేజ్‌మెంట్ అతను మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడని ప్రకటించినప్పటికీ, తుది జట్టులో ఉంటాడా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని గిల్ స్పందిస్తూ, బుమ్రా వర్క్‌లోడ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. పిచ్ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని గిల్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌ను రెండు సార్లు ఆలౌట్ చేయగల బౌలింగ్ జట్టు, అలాగే భారీ స్కోరు చేసే బ్యాటింగ్ లైన్‌అప్‌తో బరిలోకి దిగాలన్నది జట్టు లక్ష్యం. దీనిలో భాగంగా తుది జట్టులో రెండు లేదా మూడు మార్పులు జరిగే అవకాశం ఉందని గిల్ సంకేతాలిచ్చారు.