Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికు గాయం.. 11 నిమిషాల్లో ఆస్పత్రికి తరలింపు.. తాజా అప్డేట్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతి గాల్లోకి ఎగిరింది. ఆ బంతిని అందుకునే ప్రయత్నంలో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడి దిశను సరిగా అంచనా వేయలేకపోయాడు. వెనక్కి పరుగెత్తుతూ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి వెనుకకు బలంగా పడిపోయాడు. ఈ సమయంలో అతని తల మైదానానికి గట్టిగా తగలడంతో పాటు మెడపై తీవ్ర ఒత్తిడి పడింది. పడిపోయిన వెంటనే ఎంగిడి నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలోనే కదలలేని స్థితిలో కనిపించాడు.
వివరాలు
స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
దీనితో సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అంపైర్లు ఆటను నిలిపివేయగా, వైద్య సిబ్బంది స్ట్రెచర్‌తో మైదానంలోకి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఎంగిడిని స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితిలో కేవలం 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి చేరవేశారు. సాధారణంగా 7.5 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుండగా, ఈ వేగవంతమైన స్పందన విశేషంగా నిలిచింది.
వివరాలు
ప్రాణాప్రాయం ఏమీ లేదు.. పరిస్థితి స్థిరంగా ఉంది
న్యూఢిల్లీ రాజేంద్ర నగర్‌లోని పూసా రోడ్డుపై ఉన్న బీఎల్‌కే-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అతడికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఐపీఎల్ నిర్వాహకులు ఎంగిడి ఆరోగ్యంపై ప్రకటన చేస్తూ, ప్రాణాపాయం ఏమీ లేదని, పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. అవసరమైన పరీక్షల తర్వాత శనివారం రాత్రే అతడిని డిశ్చార్జ్ చేశారు. ఈ సమాచారం వెలువడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తదుపరి మ్యాచ్‌లకు ఎంగిడి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.