Manish Pandey: మనీష్ పాండే అరుదైన రికార్డు.. బ్యాటింగ్ చేయకుండానే చరిత్ర!
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన అనుభవజ్ఞుడైన బ్యాటర్ మనీష్ పాండే ఐపీఎల్ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో 19 సీజన్లలో పాల్గొన్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతను ముందుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే సాధించగా, ఇప్పుడు వారి సరసన మనీష్ పాండే చేరాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. ఈ సీజన్‌లో మనీష్ పాండేకు ఇదే తొలి మ్యాచ్. కేకేఆర్ జట్టులో సాధారణంగా ఆడే రమణ్‌దీప్ సింగ్ స్థానంలో అతనికి తుది జట్టులో అవకాశం లభించింది.
వివరాలు
ఐపీఎల్‌లో మనీష్ పాండే ఆడిన జట్లు ఇవే..
2008లో ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మనీష్ పాండే, ఆ తర్వాత తన కెరీర్‌లో అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం 36 సంవత్సరాల వయస్సు గల అతడు మొత్తం ఏడు ఫ్రాంఛైజీలకు ఆడాడు. ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పూణె వారియర్స్
వివరాలు
175 మ్యాచ్‌ల్లో..3,942 పరుగులు నమోదు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 175 మ్యాచ్‌లు ఆడిన మనీష్ పాండే 3,942 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఒక శతకం, 22 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడికి ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 19 సీజన్లలోనూ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిలో కోహ్లీ మాత్రం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒకే జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. రోహిత్ శర్మ మాత్రం ముంబై ఇండియన్స్, దక్కన్ ఛార్జర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నప్పటికీ, అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.