LOADING...
Team India: టీమిండియా రాక కోసం ఎదురుచూపులు..
టీమిండియా రాక కోసం ఎదురుచూపులు

Team India: టీమిండియా రాక కోసం ఎదురుచూపులు..

వ్రాసిన వారు Moogati Shabari
Mar 14, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్ పై పడింది. ఇక ఈ మధ్యకాలంలో తగ్గినట్లు కనిపించిన వన్డే సిరీస్‌లు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 12 నెలల్లో టీ20లకు సమానంగా వన్డే సిరీస్‌లు కూడా నిర్వహించే స్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ కి వచ్చి టీమిండియాతో తలపడేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అదే సమయంలో స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా 50 ఓవర్ల మ్యాచ్‌లు ఉండేలా బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది.

వివరాలు

విదేశాల్లో పర్యటించనున్న టీమిండియా

గత రెండు నెలలుగా భారత జట్టు తమ దేశాల్లో పర్యటించాలంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐకి అభ్యర్థనలు పంపాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ప్రధానంగా వన్డే మ్యాచ్‌లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ అనంతరం జూన్ నెలలో భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఒకే ఒక్క టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తరువాత జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో పాల్గొంటుంది. అదే పర్యటనలో ఐర్లాండ్‌తో మూడు వన్డేలు లేదా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

వివరాలు

2028 ఒలింపిక్సే టార్గెట్

ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ సిరీస్ నిర్వహణపై సందేహం నెలకొంది. మరోవైపు 2025లో బంగ్లాదేశ్‌లో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉండగా, రాజకీయ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. సెప్టెంబర్ 19న జపాన్‌లో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో భారత్ పాల్గొననుంది. గత ఆసియా క్రీడల్లో ద్వితీయ శ్రేణి జట్టును పంపినా టీమ్ ఇండియా స్వర్ణ పతకాన్ని సాధించింది. అయితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు లభించిన నేపథ్యంలో ఈసారి ప్రధాన జట్టే ఆసియా క్రీడల్లో బరిలో దిగే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

బిజీ షెడ్యూల్..

ఆసియా క్రీడలు ముగిసిన తరువాత అక్టోబర్‌లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం అదే నెలలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి పూర్తి స్థాయి సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు నిర్వహించనున్నారు. అయితే మూడు వన్డేల స్థానంలో ఐదు వన్డేలు నిర్వహించాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐని కోరింది. ఈ సిరీస్ అనంతరం భారత్ స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. తదనంతరం 2027లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో భారత్ తలపడనుంది.

Advertisement