Loading...
Mens hockey world cup : అలవోకగా కొట్టేశారు.. పాకిస్థాన్‌పై 5-3తో భారత్‌ ఘనవిజయం
అలవోకగా కొట్టేశారు.. పాకిస్థాన్‌పై 5-3తో భారత్‌ ఘనవిజయం

Mens hockey world cup : అలవోకగా కొట్టేశారు.. పాకిస్థాన్‌పై 5-3తో భారత్‌ ఘనవిజయం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (5వ, 21వ నిమిషాల్లో), అభిషేక్‌ (11వ, 24వ నిమిషాల్లో) చెరో రెండు గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోగా.. అభిషేక్‌ ఫీల్డ్‌ గోల్స్‌తో మెరిశాడు. హార్దిక్‌ సింగ్‌ (34వ నిమిషంలో) మరో గోల్‌ సాధించాడు. హనన్‌ షాహిద్‌ (22వ, 46వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా.. సుఫ్యాన్‌ ఖాన్‌ (24వ నిమిషంలో) ఒక గోల్‌ కొట్టాడు. 16ఏళ్ల తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన తొలి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. ఈ విజయంతో భారత్‌ తన ఖాతాలో పాయింట్లను ఆరుకు పెంచుకుని గ్రూప్‌-డిలో రెండో స్థానంలో నిలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.

వివరాలు

దూకుడుగా మొదలుపెట్టిన భారత్‌..

మ్యాచ్‌ ప్రారంభం నుంచే భారత్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.

దూకుడుగా ఆడిన భారత జట్టు తొలి 15 నిమిషాల్లోనే నాలుగు పెనాల్టీ కార్నర్లు సాధించింది.

రెండో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సద్వినియోగం చేసుకుని ఐదో నిమిషంలోనే భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే అభిషేక్‌ అద్భుతమైన స్ట్రైక్‌తో పాకిస్థాన్‌ రక్షణను ఛేదించి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. దీంతో పాక్‌పై భారత్‌ ఒత్తిడి మరింత పెంచింది.

కొంతసేపటి తర్వాత పాకిస్థాన్‌ కూడా లయ అందుకుని పోటీ ఇవ్వడం ప్రారంభించింది.

అయితే 21వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ మరోసారి గోల్‌ చేసి భారత్‌ ఆధిక్యాన్ని 3-0కు చేర్చాడు.

భారత్‌కు లభించిన ఐదో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న హర్మన్‌ప్రీత్‌.. రీబౌండ్‌ను నెట్‌లోకి పంపాడు.

వివరాలు

అదరగొట్టిన ఆటగాళ్లు..

ఆ వెంటనే పాకిస్థాన్‌ ఖాతా తెరిచింది. 22వ నిమిషంలో హనన్‌ షాహిద్‌ గోల్‌ చేశాడు.

అతడి తొలి ప్రయత్నాన్ని భారత గోల్‌కీపర్‌ సూరజ్‌ అడ్డుకున్నప్పటికీ.. రెండో ప్రయత్నంలో షాహిద్‌ సఫలమయ్యాడు.

అయితే పాక్‌ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 24వ నిమిషంలో అభిషేక్‌ మరో గోల్‌ చేసి భారత్‌ ఆధిక్యాన్ని మళ్లీ మూడు గోల్స్‌కు పెంచాడు.

జుగరాజ్‌ సింగ్‌ నుంచి లాంగ్‌ పాస్‌ అందుకున్న అభిషేక్‌.. అద్భుతమైన డ్రిబ్లింగ్‌తో సర్కిల్‌లోకి వెళ్లి బంతిని నెట్‌లోకి పంపాడు.

ఆ తర్వాత పాకిస్థాన్‌కు తొలి పెనాల్టీ కార్నర్‌ లభించింది. దాన్ని సుఫ్యాన్‌ ఖాన్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ ఆధిక్యం 4-2కు తగ్గింది.

రెండు గోల్స్‌ ఆధిక్యంతో భారత్‌ విరామానికి వెళ్లింది.

ADVERTISEMENT

వివరాలు

చిరకాల ప్రత్యర్థిపై ఘనవిజయం..

రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌ ఐదో గోల్‌ సాధించింది.

సర్కిల్‌లో ఆదిత్యను పాకిస్థాన్‌ ఆటగాళ్లు అడ్డుకోవడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్‌ లభించింది.

దాన్ని హార్దిక్‌ సింగ్‌ సద్వినియోగం చేసుకుని భారత్‌ ఆధిక్యాన్ని 5-2కు పెంచాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌ కూడా గట్టిగా ప్రయత్నించింది.

46వ నిమిషంలో హనన్‌ షాహిద్‌ మరో గోల్‌ చేయడంతో భారత్‌ ఆధిక్యం 5-3కు తగ్గింది.

అయినప్పటికీ మిగిలిన సమయంలో భారత్‌ ఆధిక్యాన్ని కాపాడుకుని చిరకాల ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించింది.

ADVERTISEMENT