Lionel Messi: భారత పర్యటనతో మెస్సీకి రూ.89 కోట్ల ఆదాయం.. టాక్స్ ఎంత చెల్లించాల్సి ఉంటుంది?
ఈ వార్తాకథనం ఏంటి
'గోట్ ఇండియా టూర్ 2025'తో కోట్లాదిమంది భారతీయులను ఉర్రూతలూగించిన లియోనల్ మెస్సీ(Lionel Messi) కోట్లాది రూపాయలు అర్జించాడు. తన బృందంతో కలిసి సుడిగాలిలా నాలుగు నగరాలను చుట్టేసిన మెస్సీ.. ఏకంగా రూ.89 కోట్లు కొల్లగొట్టాడు. భారత పర్యటన ద్వారా సాకర్ మాంత్రికుడికి భారీగా ఆదాయం సమకూరిందనే విషయాన్ని ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా వెల్లడించాడు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత పరిస్థితుల తర్వాత అరెస్టైన శతద్రు శనివారం దర్యాప్తు అధికారులకు కీలక విషయాలు చెప్పాడు. భారత పర్యటనలో తొలి అడుగు కోల్‌కతాలో వేసిన మెస్సీ బృందానికి సాల్ట్ లేక్ స్టేడియంలో ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వీఐపీల ఎంట్రీతో మెస్సీ అసౌకర్యానికి గురయ్యాడని శతద్రు దత్తా వెల్లడించాడు.
Details
మధ్యలోనే వెళ్లిపోయిన మెస్సీ
అందరూ చుట్టుముట్టడంతో.. ఈవెంట్ మధ్యలోనే స్టేడియం నుంచి మెస్సీని బయటకు తీసుకెళ్లాల్సి వచ్చిందని దత్తా వివరించాడు. 'మెస్సీని చూసేందుకు సాల్ట్ లేక్ స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్తారు. సంయమనం పాటించాలని పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. మెస్సీని కొందరు చుట్టుముట్టిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మొదటగా 150 మందికే పాస్‌లో జారీ చేశాం. కానీ, ఒక వ్యక్తి తన పలుకుబడితో పాస్‌లు చాలామందికి వచ్చాయి. కొందరు వీఐపీలు వెనక నుంచి ముట్టుకోవడం, హత్తుకోవడం వంటి చర్యలతో మెస్సీ చాలా అసౌకర్యంగా కనిపించాడ'ని డిసెంబర్ 13న సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానుల ఆగ్రహానికి దారి తీసిన పరిస్థితులను వివరించాడు.
Details
భారత ప్రభుత్వానికి పన్నుగా రూ.11 కోట్లు
ఇక గోట్ ఇండియా టూర్ 2025కోసం మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించామని శతద్రు తెలిపాడు. ఇందులో రూ.11 కోట్లు పన్నుగా భారత ప్రభుత్వానికి లభిస్తాయి. మొత్తంగా మెస్సీ పర్యటన ఖర్చు రూ.100 కోట్లు అయింది. ఇందులో 30 శాతం డబ్బు స్పాన్సర్లు ద్వారా, మరో 30 శాతం సొమ్ము టికెట్ల అమ్మకాల ద్వారా సమకూరిందని సిట్ అధికారులకు శతద్రు చెప్పాడు.