Sunil Gavaskar: మెస్సీ పర్యటన వివాదం.. అసలు తప్పెవరిదో చెప్పిన గవాస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాలో చోటుచేసుకున్న గందరగోళంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు నిర్వాహకులే కారణమని అందరూ విమర్శిస్తున్నారని, అయితే అసలు బాధ్యత మెస్సీదే కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మెస్సీ విఫలమయ్యాడని గవాస్కర్ విమర్శించారు. ఈ నెల 13న కోల్‌కతాలోని యువ భారతి క్రీడాంగణంలో జరిగిన కార్యక్రమంలో మెస్సీ అభిమానులకు స్పష్టంగా కనిపించకపోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు, బాటిళ్లు విసిరి స్టేడియం ఆస్తులను ధ్వంసం చేశారు.
Details
ముందుగా వెళ్లిపోవడంతో అభిమానుల అగ్రహం
ఈ ఘటనపై స్పందించిన సునీల్ గవాస్కర్.. మెస్సీకి, నిర్వాహకులకు మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో బయటకు తెలియదు. కానీ స్టేడియంలో కనీసం గంట సేపు ఉండాల్సిన మెస్సీ ముందుగానే వెళ్లిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే ఈ వ్యవహారంలో అసలు దోషి మెస్సీతో పాటు అతడి బృందమే కావొచ్చని తన కాలమ్‌లో పేర్కొన్నారు. ఆ రోజు మెస్సీ చుట్టూ రాజకీయ నాయకులు, వీఐపీలు ఉన్న మాట నిజమేనని గవాస్కర్ గుర్తు చేశారు. అయినప్పటికీ అతడి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. "మొదట అనుకున్నట్లుగా మెస్సీ స్టేడియం చుట్టూ నడిచి వెళ్లినా, లేదా పెనాల్టీ కిక్ అయినా తీసి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది.
Details
అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు
ఒకవేళ పెనాల్టీ కిక్ తీయాల్సి వస్తే అతడి చుట్టూ ఉన్నవారు తప్పుకునేవారు. అభిమానులు తమ హీరోను చూసి సంతోషపడేవారని వివరించారు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ కార్యక్రమాలు సజావుగా సాగాయని గవాస్కర్ పేర్కొన్నారు. అక్కడ అభిమానులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నందువల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. కోల్‌కతా ఘటనలో భారతీయ నిర్వాహకులను నిందించే ముందు, ఇరుపక్షాలు తమ ఒప్పందాలను సక్రమంగా పాటించాయా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.