Loading...
Mirabai chanu: కామన్వెల్త్‌ క్రీడల్లో మీరాబాయి చాను సత్తా.. భారత్‌కు తొలి స్వర్ణ పతకం
కామన్వెల్త్‌ క్రీడల్లో మీరాబాయి చాను సత్తా.. భారత్‌కు తొలి స్వర్ణ పతకం

Mirabai chanu: కామన్వెల్త్‌ క్రీడల్లో మీరాబాయి చాను సత్తా.. భారత్‌కు తొలి స్వర్ణ పతకం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 27, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మొత్తం 190 కేజీల బరువును ఎత్తి అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. నైజీరియాకు చెందిన రూత్ అసుక్వో న్యోంగ్ 168 కేజీలతో రజత పతకాన్ని గెలుచుకోగా, మలేసియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ 167 కేజీలతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మీరాబాయి చానుకు కామన్వెల్త్‌ క్రీడల్లో ఇది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. అంతకుముందు 2018లో గోల్డ్ కోస్ట్‌లో, 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో కూడా ఆమె బంగారు పతకాలు సాధించింది.

వివరాలు

స్నాచ్ విభాగంలో కొత్త రికార్డు..

దీంతో 2010, 2014, 2018లో వరుసగా మూడు స్వర్ణాలు గెలిచిన సుశీల్ కుమార్, 2014, 2018, 2022లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన వినేశ్ ఫొగాట్ తర్వాత కామన్వెల్త్‌ క్రీడల్లో వరుసగా మూడు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత అథ్లెట్‌గా మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది.

పోటీల్లో స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో ఆమె విజయవంతం కాలేకపోయింది.

అయితే రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును విజయవంతంగా ఎత్తిన చాను, మూడో ప్రయత్నంలో 85 కేజీల బరువును అధిగమించి కామన్వెల్త్‌ గేమ్స్‌ స్నాచ్ విభాగంలో కొత్త రికార్డును నెలకొల్పింది.

వివరాలు

మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా మరో అరుదైన ఘనత..

క్లీన్ అండ్ జర్క్ విభాగంలోనూ మొదటి ప్రయత్నంలో విఫలమైన మీరాబాయి, రెండో ప్రయత్నంలో 105 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి మరో రికార్డును నమోదు చేసింది.

అదే ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. స్నాచ్‌, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి మొత్తం 190 కేజీల బరువును ఎత్తిన 31 ఏళ్ల మీరాబాయి చాను, కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో అత్యధిక బరువును ఎత్తిన మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా మరో అరుదైన ఘనతను కూడా తన పేరుపై లిఖించుకుంది.

ADVERTISEMENT